
-
కత్తులు పట్టాలంటూ బాన్సువాడలో స్పీచ్
-
ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఫిర్యాదు
-
ఈసీకి కంప్లయింట్ చేసినా పట్టించుకోలేదు
-
నిబంధనలు ఉల్లంఘించారని బల్మూరి వెంకట్ పిటిషన్
-
త్వరలో విచారణకు స్వీకరించే అవకాశం
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారని పేర్కొంటూ ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు బల్మూరి. అక్టోబర్ 30న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో కత్తిదాడి జరిగింది. తీవ్ర అస్వస్థకు గురైన ఆయనను తొలుత గజ్వేల్ ఆస్పత్రికి తరలించి ప్రథమి చికిత్సలు చేయించారు. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేశారు. అదే రోజు బాన్సువాడ ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం కేసీఆర్ కు విషయం తెలియడంతో తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించుకొని సికింద్రాబాద్ చేరుకున్నారు.
బాన్సువాడ సభలో ప్రసంగిస్తుండగా కత్తిదాడి విషయం తెలియడంతో అసహనానికి లోనయ్యారు. దుబ్బాక నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థిని దుండగుడు కత్తితో పొడిచిన ఘటనను పిటిషనర్ ప్రస్తావిస్తూ.. ఆయుధాలు పట్టాలంటూ సీఎం రెచ్చగొడుతున్నారని, కత్తులతో తిరుగుతుంటే ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంటుందని హెచ్చరించారని పిటిషన్ లో పేర్కొన్నారు. "నేను నవంబర్ 3న ఈసీకి ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు," అని పేర్కొన్న బల్మూరి కోర్టు జోక్యాన్ని కోరారు. సీఎం ప్రసంగం ప్రజాప్రాతినిధ్య చట్టం స్ఫూర్తిని కించపరిచేలా ఉందన్నారు. త్వరలోనే ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది..
కేసీఆర్ ఏమన్నారంటే..
ప్రజల ముందు ఎన్నికలను ఫేస్ చేసే దమ్ము లేక.. హింసకు దాడులకు దిగుతున్నారన్నారు. కత్తులు పట్టి మా అభ్యర్థుల మీద దాడులు చేస్తున్నారని... వీళ్లకు తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలని నేను కోరుతున్నానని అన్నారు.. కత్తిపట్టుకొని పొడవడమంటే . ఇంత మందిమి ఉన్నం మాకు చేతుల్లేవా..? మొండిదో లండుతో మాకో కత్తి దొరకదా..? ఒక వేళ మాకు తిక్కనే రేగితే.. దుమ్ము దుమ్మే రేగాలె ... తస్మాత్ జాగ్రత్త అని నేను హెచ్చరిస్తున్నా.. పది సంవత్సరాల్లో ఎన్నో ఎన్నికలు జరిగినయ్.. ఎన్నడూ మేం హింసకు దిగలే.. ప్రజలు గెలిపిస్తే గెలిచినం.. శాతనైన కాడికి సేవ చేసినం తప్ప దుర్మార్గమైన పనులు చేయలే..
కానీ మా సహనాన్ని పరీక్షిస్తే.. ఇయ్యాళ్ల దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి.. కేసీఆర్ మీద దాడి జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్న..ఈ దాడులు కనుక ఆపకపోతే.. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోక పోతే మాకు కూడా దమ్ముంది.. మేం గూడా అదే పనికి దిగితే మీరు ఎక్కడ మిగులరు.. దుమ్మ గూడా మిగులదని నేను మనవి చేస్తా ఉన్న.. మేం బాధ్యతలో ఉన్నమని, ప్రజలకు సేవ చేయాలని ఈ పనులల్లో మేమున్నం.. మీరు దుర్మార్గమైన పనిచేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఎజెండా చెప్పండి మీకు దమ్ముంటే.. లంగ చాతలు ఏంది.. గుండా గురి ఏంది.. అక్కడ గన్ మన్ అప్రమత్తంగా ఉండటంతో ప్రభాకర్ రెడ్డి గారి ప్రాణాలు దక్కినాయని సీఎం కేసీఆర్ అన్నారు.