
- ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకు గ్రాంట్ ఎట్లిస్తరు?
- కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ ఫైర్
- గోదావరి నీళ్ల దోపిడీకి ఏపీ కుట్రలు పన్నుతున్నది
- కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నరు?
- సీఎం ఎందుకు నోరు విప్పుతలే?
- అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి
- బనకచర్లకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి
హైదరాబాద్, వెలుగు: గోదావరి జలాలను దోపిడీ చేసేందుకు పథకం ప్రకారం ఏపీ కుట్రలు పన్నుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించా రు. "ఆనాడు పాలమూరు-రంగారెడ్డి సహా 20, 30 ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. ఇప్పుడు మిగులు జలాలంటూ బనకచర్ల ప్రాజెక్టుతో 200 టీఎంసీల గోదావరి నీళ్లను దోచుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారు" అని ఆయన మండిపడ్డారు.
విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల పర్మిషన్ తీసుకోవాల ని, నదీ పరివాహక రాష్ట్రాలూ ఒప్పుకోవాల్సి ఉంటుందని చెప్పారు.దాంతో పాటు అపెక్స్ కౌన్సిల్, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు, పర్యావరణ అనుమతులూ. తీసుకోవాల్సి ఉంటుందని హరీశ్ రావు పేర్కొన్నారు. కానీ, ఏ ఒక్క అనుమతి లేకుండానే బనకచర్ల ప్రాజె క్టును ఏపీ నిర్మిస్తున్నదని అన్నారు. జీరో పర్మిషన్ ప్రాజెక్టుకు అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
"తెలంగాణపై బీజేపీ ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నది? పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి.. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి ఎందుకు జాతీయహోదా ఇవ్వరు? పోలవరానికి రూ.80 వేలకోట్లు, బనకచర్ల కు రూ.80 వేల కోట్లు మొత్తంగా రూ.1.60 లక్షల కోట్లు ఏపీకి ఇస్తున్నారు. అందులో తెలంగాణకు ఒక్క శాతమైనా ఇచ్చారా? ఇప్పటికైనా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని బనకచర్ల ప్రాజెక్టును ఆపించాలి. లేదంటే ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఆఫీసు ముందు ధర్నా చేస్తాం" అని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బసకచర్లను వ్యతిరేకిస్తున్నట్టు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.
అవి తెలంగాణ నీళ్లు
మిగులు జలాలతోనే బనకచర్ల ప్రాజెక్ట్ కడుతున్నా మంటూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నారని.. కానీ, అవి మిగులు జలాలు కాదని, తెలంగాణ వాడుకోకపోవడంతో కిందికి వెళ్తున్న నీళ్లు అని హరీశ్ రావు చెప్పారు. అసలు గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ వేయించాలని ఏపీ కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు.
"ట్రిబ్యునల్ వచ్చే లోపే బనకచర్లను నిర్మించి 200 టీఎంసీలను తన్నుకుపోవాలని ఏపీ కుట్రలకు పాల్పడుతున్నది. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి ఏం చేస్తున్నారు? ఎలాంటి అనుమతులూ లేని ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం గ్రాంట్ ఇస్తున్నది. మరో 50 శాతం ఎస్ఆర్ బీఎం పరిమితికి మించి రుణాలు తీసుకునేందుకు అవకాశం కల్పించనుంది.
ప్రధాని మోదీ దగ్గరకు కిషన్ రెడ్డి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలి" అని ఆయన డిమాండ్ చేశారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం.. పోలవరం ద్వారా 80 టీఎంసీల ను తరలిస్తే అందులో 45 టీఎంసీలు తెలంగాణకు, 25 టీఎంసీలు కర్నాటకకు. 14 టీఎంసీలు మహా రాష్ట్రకు కేటాయించాలన్న రూల్ ఉందని హరీశ్ రావు తెలిపారు. ఏపీ పట్టిసీమతో నీటిని డైవర్ట్ చేస్తే వెంటనే కర్నాటక 25 టీఎంసీలు ఇవ్వాలని సీడబ్ల్యూ సీని డిమాండ్ చేయగా.. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ఆ మేరకు నీటిని కేటాయించారని తెలిపారు.
మహారాష్ట్ర కోరిక మేరకు 14టీఎంసీలను ఇచ్చారని పేర్కొన్నా రు. కానీ, తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీలను ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నోరు విప్పడం లేదని.. నాడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేస్తే పోరాడింది బీఆర్ఎస్, పీజేఆర్ అని, హారతులు పట్టింది కాంగ్రెస్ పార్టీ అని హరీశ్ రావు దుయ్యబట్టారు. అప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణ పాలిట కాంగ్రెస్ శాపంలా మారిందని విమర్శించారు.