శాంతి భద్రతలు క్షీణిస్తున్నయ్ : సంజయ్

శాంతి భద్రతలు క్షీణిస్తున్నయ్ : సంజయ్
  • రాష్ట్ర ప్రజలకు రక్షణ లేకుండాపోతున్నది: సంజయ్
  • పోలీసులపైనేహత్యాయత్నం చేస్తున్నరు
  • రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎంఐఎంకు చెందిన రౌడీషీటర్లు.. పోలీసులపై హత్యాయత్నం చేసే స్థాయికి పెట్రేగి పోతున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తున్నదన్నారు. జూబ్లీహిల్స్ లో ఒక వర్గం ఓట్ల కోసం ఎంఐఎం కాళ్లు పట్టుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిపోయిందని విమర్శించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావాలంటే యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో కరీంనగర్ లోని ‘మేరా యువ భారత్’ ఆఫీస్​లో సోమవారం సంజయ్ మీడియాతో మాట్లాడారు. 

యూపీ సర్కార్​ను స్ఫూర్తిగా తీసుకోవాలి

‘‘మొన్న నిజామాబాద్ లో మజ్లిస్ రౌడీషీటర్ కానిస్టేబుల్ ను చంపేశాడు. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున డీసీపీ చైతన్య, కానిస్టేబుల్ పై ఎంఐఎం రౌడీషీటర్ హత్యాయత్నం చేసినా దిక్కులేదు. గో రక్షకులపై కాల్పులు జరిపి చంపేందుకు యత్నిస్తున్నారు. యూపీ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలి. రాష్ట్ర మంత్రులు.. మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని ఇబ్బందిపెడ్తున్నరు. 

వెంటనే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరిపి నివేదిక తెప్పించుకోవాలి. అలాంటి మంత్రులను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి’’అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని, తెలంగాణను పాకిస్తాన్ లో కలపాలని లేదా ముస్లిం దేశంగా మార్చాలని ఆనాడు నిజాం రాజు కుట్రలు చేసిండని గుర్తు చేశారు. సమావేశంలో మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి పాల్గొన్నారు.