పైసలతో, గూండాయిజంతో రాజకీయం చేసే నీచుడు మైనంపల్లి

పైసలతో, గూండాయిజంతో రాజకీయం చేసే నీచుడు మైనంపల్లి
  • ఖబడ్దార్ మైనంపల్లి.. రేపట్నుంచి నీ సంగతి చూస్తాం
  • నీ అక్రమాలు బయటపెడతాం.. నిన్ను తొక్కిపడేస్తాం: బండి సంజయ్
  • మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్ ను పరామర్శించిన బండి సంజయ్, మాజీ ఎంపీ విజయశాంతి

సికింద్రాబాద్: ‘‘ఎమ్మెల్యే మైనంపల్లి చాలా నీచమైన వ్యక్తి, గూండాయిజం, దాడులతో రాజకీయం చేస్తుండు. బీజేపీలో చేరదామని వస్తే మేం తరిమికొట్టినం. ఆలాంటి వ్యక్తిని కేసీఆర్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటు. ఖబర్దార్ మైనంపల్లి.    నువ్వు పైసలతో,  గూండాయిజంతో రాజకీయం చేస్తున్నావ్. మేము పార్టీ జెండాలతో  పోరాడుతున్నాం. నీ ప్రభుత్వం, ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు...రేపటి నుండి నీ సంగతి చూస్తాం. నీ అక్రమాలను బయటపెడతాం.. నీ రౌడీయిజాన్ని తొక్కిపడేస్తాం..’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహంతో ఊగిపోయారు. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై  దాడి జరుగుతున్న సమయంలో చోద్యం చూస్తున్న పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై తక్షణమే డీజీపీ స్పందించాలి, మైనంపల్లి సహా టీఆరెస్ గూండాలపై హత్యా యత్నం కేసు నమోదు చేయాలని,  లేనిపక్షంలో బీజేపీ సత్తా చూపుతామని ఆయన హెచ్చరించారు. 
ఆదివారం స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కాజ్ గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను మాజీ ఎంపీ విజయశాంతి, మాజీమంత్రి విజయరామరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు,  మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ తదితరులతో కలసి బండి సంజయ్ పరామర్శించారు. మల్కాజ్ గిరి గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న  కార్పొరేటర్ శ్రవణ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన అనుచరులైన టీఆరెస్ నాయకులు తనపై దాడిచేసారని బీజేపి నాయకులకు తెలియజేశారు. నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉందని, సెక్యురిటి కల్పించాలని కోరార శ్రవణ్. భయాందోళనతో వణికిపోతున్న శ్రవణ్ ను, కుటుంబ సభ్యులను బీజేపీ నాయకులు ఓదార్చారు. శ్రవణ్ పై దాడిని తీవ్రంగా ఖండించారు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ విజయశాంతి.  శ్రవణ్ పై జరిగిన దాడి సీసీ టీవీ వీడియో ను చూశారు. తనపై బూతులు తిడుతూ కావాలనే తమపై టీఆర్ఎస్ నేతలు దారుణంగా దాడి చేశారని శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. తనపై దాడి సందర్భంగా భారతమాత ఫోటోను సైతం టీఆరెస్ నాయకులు ఘోరంగా అవమానించారని శ్రవణ్ ఫిర్యాదు చేశారు. దీంతో తీవ్రంగా స్పందించిన బండి సంజయ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, టీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహంతో ఊగిపోయారు. శ్రవణ్ తోపాటు బీజేపీ  మహిళా కార్పొరేటర్లు, కార్యకర్తల పై దాడి చేసినవారిని తక్షణమే ఆరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా ఎదుట డిమాండ్ చేశారు బండి సంజయ్.