నన్ను అసెంబ్లీకి పోనియ్యకుండ కేసీఆర్ కుట్రలు జేస్తుండు : బండి సంజయ్

నన్ను అసెంబ్లీకి పోనియ్యకుండ కేసీఆర్  కుట్రలు జేస్తుండు : బండి సంజయ్
  • కేటీఆర్, ఆయన కుటుంబం లక్షల కోట్లు దోచింది  
  • సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ చీలుతయ్  
  • కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ కొంటున్నడని కామెంట్

ఎన్నికల ప్రచారం కోసం తాను ఎక్కడికెళ్లినా కరెంట్ కట్ చేయిస్తున్నారని.. కానీ మరో పదిహేను రోజుల్లో సీఎం కేసీఆర్ పవరే కట్ అవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. తనను అసెంబ్లీకి రానీయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళల పక్షాన కేసీఆర్ సర్కార్ పై తాను పోరాటం చేసినందుకే ఎలాగైనా సరే ఓడించాలని కంకణం కట్టుకున్నారని అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో పార్టీ అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ గెలుపు కోసం నిర్వహించిన కార్నర్ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ తనను వాడు వీడు అని తిడుతున్నడని, అమెరికా నుంచి వచ్చి పోజులు కొడ్తున్నడని సంజయ్ అన్నారు. ‘‘కంకులు కాల్చేటోళ్లు, దోసెలు వేసుకునేటోళ్ల దగ్గరికొచ్చి ఫొటోలకు పోజులిస్తూ జైతెలంగాణ అన్నవ్. నువ్వూ నీ కుటుంబం ప్రజలను ముంచి, వాళ్ల బతుకులను బజారులో పడేసి రూ.లక్షల కోట్లు దోచుకున్నరు. ఆ డబ్బులతో దుబయ్, మస్కట్, అమెరికా, లండన్​లో పెట్టుబడులు పెట్టిండ్రు’’ అని ఆరోపించారు. హుస్నాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమీలేదన్నారు. కేంద్రం ఇచ్చిన 24,000 ఇండ్లు ఎటుపోయాయో ఎమ్మెల్యే చెప్పాలన్నారు. సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు హైవే కోసం తాను రూ.578 కోట్లు తెచ్చి పనులు చేయిస్తున్నానని చెప్పారు. ఇందుర్తి నుంచి సుందరగిరి వరకు సీఆర్ఎఫ్ నిధుల నుంచి రూ.15 కోట్లతో డబుల్​రోడ్డు, ఇందుర్తి నుంచి హుస్నాబాద్​కు రూ.24 కోట్లతో రోడ్డు నిర్మించామన్నారు. పీఎం సహాయ నిధి ద్వారా1,210 మందికి సహాయం చేశామన్నారు.    

సీఎం కుర్చీపై ఆ రెండు పార్టీల్లో లొల్లి   

సీఎం పదవి కోసం కేసీఆర్ ఇంట్లో రోజూ గొడవ జరుగుతోందని సంజయ్ చెప్పారు. ‘‘కేటీఆర్ ను సీఎం చేయాలని ఆయన తల్లి కేసీఆర్ ను నిలదీస్తుంటే.. తామెటు పోవాలని హరీశ్​రావు, కవిత, సంతోష్​రావు లొల్లి చేస్తూ టీవీలు పగులగొట్టుకుంటున్నారు. కాంగ్రెస్​లోనూ అదే పరిస్థితి ఉంది. రేవంత్, ఉత్తమ్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, వెంకటరెడ్డి సీఎం పదవి కావాలని పట్టుపడుతున్నారు. ఆఖరికి హుస్నాబాద్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కూడా సీఎం కుర్చీ కావాలంటడేమో” అని ఆయన ఎద్దేవా చేశారు.  

కేసీఆర్ 70 మందిని కొంటుండు..  

బీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతో కేసీఆర్ ఇప్పటి నుంచే 70 మంది కాంగ్రెస్ అభ్యర్థులను కొనే పనిలో ఉన్నాడన్నారు. వాళ్లను గెలిపించుకునేందుకు డబ్బులు ఖర్చుపెడుతున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన తర్వాత వాళ్లను బీఆర్ఎస్ గంప కింద కమ్ముడు ఖాయమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​లకు ఓటు వేస్తే ఆ పార్టీలు సీఎం కుర్చీ కోసం పోటీ పడి చీలిపోతాయన్నారు. మళ్లీ ఉప ఎన్నికలు వస్తాయన్నారు. బీజేపీకి ఓటు వేస్తేనే సుస్థిర ప్రభుత్వం వస్తుందని చెప్పారు. కరీంనగర్ సిటీలోని పలు కాలనీల్లో, కరీంనగర్ ​రూరల్​ మండలం బొమ్మకల్​లో జరిగిన ర్యాలీల్లోనూ సంజయ్ మాట్లాడారు.

 ‘‘బీఆర్ఎస్ నేతల రౌడీయిజం, అవినీతి తారస్థాయికి చేరింది. శ్మశాన వాటికల్లో గడ్డి పెరిగిందని దొంగ బిల్లులు పెట్టి దండుకున్న నీచులు వాళ్లు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుంది” అని ఆయన హెచ్చరించారు. కరీంనగర్ లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ భూకబ్జాదారులు అని, వారిదంతా అక్రమాలు, అవినీతి లొల్లి అని విమర్శించారు.