రాష్ట్రంలో ఏం చేయని కేసీఆర్​.. దేశంలో ఏం చేస్తడు: సంజయ్‌‌

రాష్ట్రంలో ఏం చేయని కేసీఆర్​.. దేశంలో ఏం చేస్తడు: సంజయ్‌‌
  • రాష్ట్రంలో ఏం చేయని కేసీఆర్​.. దేశంలో ఏం చేస్తడు: బండి సంజయ్‌‌
  • బీఆర్ఎస్‌‌తో తుక్డే తుక్డే గ్యాంగ్‌‌లన్నీ కలిశాయని విమర్శ

మెట్‌‌పల్లి, వెలుగు: బీఆర్ఎస్ ప్రకటనతో తెలంగాణకు పట్టిన పీడ విరగడ అయిందని బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ సంజయ్‌‌ అన్నారు. దేశాన్ని దోచుకునేందుకు తుక్డే తుక్డే గ్యాంగ్‌‌లన్నీ బీఆర్‌‌‌‌ఎస్‌‌తో కలిసిపోయాయన్నారు. తెలంగాణలో ఏం చేయలేనోడు, దేశంలో ఏం చేస్తాడని మండిపడ్డారు. శుక్రవారం బండి సంజయ్ యాత్ర జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లి మండలం వెంపేట నుంచి ప్రారంభమైంది. మెట్‌‌పల్లి పాత బస్టాండ్ వద్ద జరిగిన మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఏర్పాటుతో రాష్ట్రంలో టీఆర్ఎస్ ఖతమైందన్నారు. వందల మంది యువకుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్‌‌​ఇండ్లు కట్టారు? ఎన్ని పరిశ్రమలు స్థాపించి, ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. సర్కారు చెప్పింది నిజమైతే కేసీఆర్‌‌‌‌కు తోమాల సేవ, పల్లకి సేవ చేస్తానని, అబద్ధమైతే బడిత పూజ చేస్తానని హెచ్చరించారు. 

ఊళ్లల్లో కేసీఆర్‌‌‌‌ బాధిత సంఘాలు ఉన్నయ్‌‌..

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని, ప్రతి ఊళ్లో కేసీఆర్ బాధిత సంఘం ఉందని, ఆయన మీద పగ తీర్చుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నారని సంజయ్‌‌ అన్నారు. కేసీఆర్ కుటుంబం లిక్కర్ నుంచి శాండ్ వరకు అక్రమ వ్యాపారాలు చేస్తూ, స్కామ్‌‌లకు కేరాఫ్ అడ్రస్‌‌గా మారిందని విమర్శించారు. స్కామ్‌‌లు చేసిన కేసీఆర్, కవిత జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ‘చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, కేసీఆర్ నోటికి కోతలెక్కువ’అని ఎద్దేవా చేశారు. మెట్‌‌పల్లికి రూ.50 కోట్లు ఇచ్చామని చెప్తున్నారని, ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా అని ప్రశ్నించారు. గతంలో మెట్‌‌పల్లి నియోజకవర్గంలో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే చెన్నమనేని విద్యాసాగర్ రావు చేసిన అభివృద్ధి పనులే తప్ప కొత్తగా ఏం జరగలేదన్నారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా పార్లమెంట్‌‌కు పోలేదని, విజయశాంతి మాత్రమే రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడారన్నారు. అసలు సిసలు ఉద్యమకారులంతా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారని చెప్పారు.

లక్ష కోట్లతో ఢిల్లీలో కవిత లిక్కర్​ దందా.. 

కేసీఆర్ కూతురు కవిత రూ.లక్ష కోట్లతో ఢిల్లీలో లిక్కర్​ దందా చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. క్యాసినోల్లోనూ కవిత పెట్టుబడులు పెట్టారన్నారు. కేంద్ర పరిధిలో ఉండే ఖాదీ బోర్డులో కేసీఆర్ సర్కారు పెత్తనం చెలాయిస్తున్నదని, బోర్డులో పద్మశాలీలకు చోటివ్వకుండా దొరల బోర్డుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాదీ భూములను 99 ఏండ్ల లీజు పేరిట అమ్ముకునేందుకు కట్ర జరుగుతోందన్నారు. సహారా ఇండియా స్కామ్‌‌లో అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. ఈఎస్ఐ, సహారా స్కామ్‌‌లపై విచారణ జరిపించి, కేసీఆర్ కుటుంబ అవినీతి బయటపెడతామని చెప్పారు. 

తెలంగాణపై మాట్లాడే అర్హత కోల్పోయినవ్‌‌..

పార్టీ పేరు నుంచి, జెండా నుంచి తెలంగాణను తొలగించారని, ఇప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కోల్పోయారని సంజయ్ అన్నారు. కవిత లిక్కర్ దందా కేసుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్‌‌తో కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ మీటింగ్‌‌లో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ ముఖంలో సంతోషం కనిపించలేదని, అది పార్టీ ఆవిర్భావ సభలా లేదని.. సంతాప సభలా ఉందన్నారు. సమైక్యవాది అయిన ఉండవల్లిని తీసుకొచ్చి, దావత్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అనడం సమంజసం కాదన్నారు. బీఆర్ఎస్‌‌ను బందిపోట్ల రాష్ట్ర సమితి అని వర్ణించారు. రానున్న రోజుల్లో బీజేపీ జెండా కాంతిలో రంగురంగుల జెండాలు మాడి మసైపోతాయని చెప్పారు. 

పార్లమెంట్ నియోజకవర్గ విస్తారక్​లతో సంజయ్ భేటీ

ఇటీవల నూతనంగా నియమించిన పార్లమెంట్ నియోజకవర్గ విస్తారక్‌‌లతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ భేటీ అయ్యారు. మెట్‌‌పల్లిలోని ప్రజా సంగ్రామ యాత్ర లంచ్ శిబిరం వద్ద జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి పాల్గొన్నారు. సంజయ్ మాట్లాడుతూ, పోలింగ్ బూత్ మొదలు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. మిషన్- 2023 పేరిట రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే మకాం వేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.