ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలే: బండి సంజయ్

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలే: బండి సంజయ్

 

  • కేసీఆర్ జేబు మనిషిలా ఎన్నికల ప్రధాన అధికారి
  • గులాబీ లీడర్లకు గులాంగిరీ చేసేటోళ్ల అంతు చూస్తం
  • ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీనే
  • ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడిన ఓటర్లకు హ్యాట్సాఫ్
  • పోరాడిన బీజేపీ కార్యకర్తలకు, యువతకు సెల్యూట్

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. మనీ, మద్యం ఏరులై పారించినా మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది తామేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. గులాబీ లీడర్లకు గులాంగిరీ చేసే అధికారులు, పోలీసుల అంతు చూస్తామని హెచ్చరించారు. కేసీఆర్ జేబు వ్యక్తిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మారారని, ఆయనపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మునుగోడు బైపోల్‌‌‌‌‌‌‌‌లో పోలీసుల సాయంతో టీఆర్ఎస్ ఎన్ని అరాచకాలకు పాల్పడినా, దాడులతో భయభ్రాంతులకు గురిచేసినా వెరవకుండా ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడిన ఓటర్లకు హ్యాట్సాఫ్ చెప్పారు. అధికార పార్టీ అరాచకాలపై పోరాడిన బీజేపీ కార్యకర్తలకు సెల్యూట్ చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల ప్రక్రియను నాశనం చేశారు

“ఇప్పుడే ట్విట్టర్ టిల్లు టెలికాన్ఫరెన్స్ విన్న. డబ్బులిచ్చి ఓటర్లను తీసుకొచ్చి టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓటేయించండని చెబుతున్నడు.. దీన్ని ఫోన్ ద్వారా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన” అని బండి సంజయ్ చెప్పారు. మునుగోడు ఓటింగ్ సరళి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి నింపిందని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించాలనే సంకేతాలను పంపారని పేర్కొన్నారు. ‘‘మునుగోడు ఎన్నిక ప్రచారం మొదలైనప్పటి నుంచే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు మనీ, మందు పారిస్తూ ప్రలోభాలకు గురిచేశారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. కానీ ఎన్నికల ప్రధాన అధికారి పూర్తిగా కేసీఆర్ జేబు మనిషిగా మారారు. ఫొటోలకు ఫోజులివ్వడం తప్పా, ఆయన చేసిందేమీ లేదు. డబ్బు ఇచ్చిన వాళ్లు, తీసుకున్న వాళ్లు నేరస్తులేనని చిలకపలుకులు పలికారు. ఈ తతంగమంతా చూడనట్లు వ్యవహరించిన ఆయన కూడా ఈ లెక్కన నేరస్తుడే. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నాశనం చేశాడు” అని మండిపడ్డారు. వేలాది మంది టీఆర్ఎస్ స్థానికేతర నాయకులు మునుగోడులో తిష్టవేసి ప్రలోభాలకు గురిచేస్తుంటే వాళ్లని వదిలి.. బీజేపీ నాయకులను దొరకబట్టుకుని అప్పగించారని ఆరోపించారు.

ఎస్పీ అడ్డగోలుగా వ్యవహరించారు

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శివన్నగూడెం వెళ్తే.. టీఆర్ఎస్ గూండాలు తప్పతాగి దాడికి యత్నించారని,  సిద్దిపేట నుంచి 200 మంది టీఆర్ఎస్ గూండాలు వచ్చి అరాచకం చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ వద్ద క్యూలో చండూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఉంటే.. ఎస్పీ వచ్చి అడ్డగోలుగా వ్యవహరించారన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మునుగోడులో గెలిచేది రాజగోపాల్ రెడ్డి మాత్రమేనన్నారు. ఓటుకు రూ.30 వేలు ఇచ్చినా, బంగారు బిస్కెట్లు ఇచ్చినా ప్రజలు బీజేపీని గెలిపించబోతున్నరని, రాజగోపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే కాబోతున్నారని తెలిపారు. టీఆర్ఎస్ బూతు చానల్ వాహనంలో, అంబులెన్సుల్లో డబ్బు సంచులు తీసుకెళ్లి ఓటర్లకు పంచారని ఆరోపించారు.

పోలింగ్‌‌‌‌‌‌‌‌ టైంలోనూ ప్రలోభాలు

‘‘పోలింగ్ జరుగుతున్న సమయంలో మంత్రి కేటీ ఆర్.. రంగంతండ, హాజినా తండా ప్రజలకు ఫోన్ చేసి అన్ని విధాలా ఆదుకుంటామంటూ ప్రలోభపెడుతూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. టీఆర్ఎస్ కార్యకర్తలే బీజేపీ కండువాలు వేసుకుని తండాలకు పోయారు. బీజేపీకి ఓటేస్తామనే వారిని పోలింగ్‌‌‌‌‌‌‌‌కు రాకుండా అడ్డుకున్నారు” అని సంజయ్ ఆరోపించారు. ఇతరత్రా పనులకు డబ్బు తీసుకెళ్లే బీజే పీ నేతలను పట్టుకుంటున్న పోలీసులు.. టీఆర్ఎస్ నేతలను ఎందుకు పట్టుకోలేదన్నారు. మందు, మనీ పంచలేదని చెప్పే దమ్ము ఉందా అని నిలదీశారు.

పురిట్లోనే బీఆర్ఎస్ ఖతం

ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు అనుకూలమైన అధికారుల లిస్ట్ తయారు చేసుకుని, వాళ్లకు డ్యూటీ వేసి బీజేపీ నేతలను, కార్యకర్తలను కొట్టించారని, అయినా కార్యకర్తలు అదరలేదని, తెగించి కొట్లాడారని బండి సంజయ్ చెప్పారు. పురిట్లోనే బీఆర్ఎస్ ఖతం కాబోతున్నదని, అయ్యా కొడుకుల పనైపోయిందని, అబద్ధాల అల్లుడికి జనం తగిన బుద్ధి చెప్పబోతున్నారని తెలిపారు. ఓ గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓటుకు రూ.50 వేలు ఇచ్చాడని, ఒక్క గ్రామానికే రూ.20 కోట్లు ఖర్చు పెట్టానని బాహాటంగా చెప్పుకుంటున్నారంటే, ఏ స్థాయిలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించారో అర్థమవుతున్నదని చెప్పారు. వీళ్ల తీరుతో సామాన్యులు, కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.