
- చేనేత జీఎస్టీ మీటింగులో తాగి మాట్లాడినవా?
- ‘ట్విట్టర్ టిల్లు’ సమాధానం చెప్పాలి
- మంత్రి కేటీఆర్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్
చౌటుప్పల్, వెలుగు: చేనేత వస్త్రాలపై జీఎస్టీ గురించి జరిగిన మీటింగులో మంత్రి కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. అప్పుడు మందు తాగి మాట్లాడినవా అని మండిపడ్డారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బండి సంజయ్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి దీపావళి శుభాకాంక్షలు చెప్పి, కమలం పువ్వు చూపిస్తూ ఓట్లు అడిగారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులపై ప్రేమ ఉంటే బతుకమ్మ చీరల తయారీలో మునుగోడు నియోజకవర్గంలోని ఎంత మందికి అవకాశం కల్పించావని ప్రశ్నించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ గురించి మొదటి మీటింగులో ఎందుకు ప్రశ్నించలేదో ‘ట్విట్టర్ టిల్లు’ సమాధానం చెప్పాలని, జీఎస్టీ మీటింగులో కేటీఆర్ ప్రసంగం వీడియోను చూపిస్తూ నిలదీశారు.
నూలు, రంగులపై రాష్ట్ర ప్రభుత్వ 50 శాతం సబ్సిడీ ఇస్తామని ఎందుకు ఇవ్వలేదో జనాలకు చెప్పాలన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కుటుంబ పాలనకు ఆమోదం తెలిపినట్లు అవుతుందన్నారు. డబుల్ఇండ్లు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు సాయం చేయకుండా తమ పాలనకు ప్రజలు మద్దతు ఉందని ప్రకటించుకోవడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనం అన్నారు. లిక్కర్, డబ్బు పంచి, అబద్ధాల ప్రచారంతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికలు మునుగోడుకు మాత్రమే కాదని, తెలంగాణ పేదల భవిష్యత్తు వీటిపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రజలంతా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సంజయ్ వెంట మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ గొని శంకర్ ఉన్నారు.
‘కేసీఆర్ ఝూఠా మాటలు’ పోస్టర్ రిలీజ్
చండూరు(మర్రిగూడ): ఝూఠా మాటల కేసీఆర్ ఇదిగో నీ పచ్చి అబద్దాల చిట్టా అంటూ బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. మంగళవారం మర్రిగూడలోని క్యాంప్ ఆఫీసులో ‘కేసీఆర్ ఝూఠా మాటలు’ అనే పోస్టర్లను ఆయన రిలీజ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ మరోసారి అబద్దాలు, తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసేందకు సిద్ధమయ్యారన్నారు. మందు, మాంసం, మనీతో గెలవాలని చూస్తున్నారని, ‘కేసీఆర్ ఝూఠా మాటలు’ పోస్టర్లను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోస్టర్లలో ‘దళిత నాయకుడిని సీఎం చేస్తా.. చెప్పిన అంటే తల నరుక్కుంటా గానీ, మాట తప్పను.. రాష్ట్రానికి దళిత నాయకుడే సీఎం, దళితులకు మూడెకరాల భూమి ఇస్తా, 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తా, నిజాంషుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తా’ వంటి హామీలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీలు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, టి.ఆచారి, తుల ఉమ, యాస అమరేందర్ రెడ్డి, రామదాస్ శ్రీనివాస్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.