సర్కార్ దగ్గర ఉద్యోగుల జీతాలకే పైసల్లేవ్ : బండి సంజయ్ కుమార్

సర్కార్ దగ్గర ఉద్యోగుల జీతాలకే పైసల్లేవ్ : బండి సంజయ్ కుమార్
  • తీగలగుట్టపల్లి ఆర్వోబీకి నిధులు కేంద్రానివే..
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ 

కరీంనగర్ సిటీ, వెలుగు : కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు. జీతాలే ఇయ్యలేనోడు పింఛన్లు ఎట్లా ఇస్తాడని ప్రశ్నించారు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలో సోమవారం  బండి సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించగా వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ  తీగలగుట్టపల్లి ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణానికి తాను నిధులు తీసుకొస్తే... కనీసం తనను పిలవకుండా కొబ్బరికాయ కొట్టి తానే నిధులు తెచ్చినట్లుగా మంత్రి గంగుల ఫోజులు కొడుతున్నాడని మండిపడ్డారు. 'గంగుల..దమ్ముంటే తీగలగుట్టపల్లికి రా... ఆర్వోబీకి నిధులు తెచ్చిందెవరో బహిరంగ చర్చకు సిద్దమా?' అంటూ సవాల్ విసిరారు.

తాను ప్రశ్నించే గొంతుకనని, తనను పిసికి చంపాలని చూస్తున్నారన్నారు. పొరపాటున గంగులను గెలిపిస్తే కేసీఆర్ మళ్లీ  అధికారంలోకి వచ్చి నరకం చూపిస్తాడని ప్రజలను హెచ్చరించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఊళ్లల్లో భూములను కబ్జా చేసుకుంటాడుని, బీఆర్ఎస్ క్యాండిడేట్‌‌‌‌ను గెలిపిస్తే సిటీలోని భూములను, గుట్టలను మాయం చేస్తాడని ఆరోపించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన లీడర్లు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. హోటల్​వర్కర్స్ యూనియన్​నాయకుడు శ్రీనివాస్​ఆధ్వర్యంలో 160 మంది బీజేపీలో చేరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ ,కాశెట్టి శేఖర్ , వోడ్నాల కోటేశ్వర్ , జొనుకుటి భూమయ్య , గాండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ALSO READ : సమస్యాత్మక పోలింగ్​ స్టేషన్లను గుర్తించాలి : వసంతకుమార్