
- శత్రు ఆస్తులపై తక్షణమే సర్వే చేయించండి: కేంద్ర మంత్రి సంజయ్
న్యూఢిల్లీ, వెలుగు: స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ కేసులను ఈ నెలాఖరులోపు పరిష్కరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న శత్రు ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీస్) సమస్యలను పరిష్కరించేందుకు సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఎనిమీ ప్రాప ర్టీస్ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.
మంగళవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధులు, పునరావాస విభాగం, కస్టోడియన్ ఆప్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా(సీఈపీఐ) అధికారులతో బండి సంజయ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర్య సైనిక్ సత్కార యోజన(ఎస్ఎస్ఎస్ వై) కింద 26,623, స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్ కు సంబంధించి 8,829 ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని, 12,800 ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయని అధికారులు వివరించారు.
1,427 ఎనిమీ ప్రాపర్టీస్‌కు సంబంధించిన వివాదాలను పరిష్కరించి ఆయా ఆస్తులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుందని తెలిపారు. అందులో 1,300కుపైగా ప్రాపర్టీస్ యూపీకి సంబంధించినవేనని వివరించారు. అలాగే, 313 ఆస్తులు వేలం వేయగా రూ.107 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన పత్రాలు అందకపోవడం వల్లే పెండింగ్ లో ఉన్నాయని అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి.. ఆయా రాష్ట్రాలకు లేఖలు పంపాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. పింఛన్ మంజూరును వేగవంతం చేయడానికి ప్రత్యేక బృందాలను రాష్ట్రాలకు పంపాలని చెప్పారు.
ఎనిమీ ప్రాపర్టీస్ కు సంబంధించి యుద్ద ప్రాతిపదికన సర్వే, సరిహద్దు నిర్ధారణ పనులు పూర్తి చేయాలన్నారు. తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ కేసు ల పురోగతిపై పూర్తి వివరాలు అందించాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. అలాగే, వచ్చే నెలలో సీఈపీఐ శాఖ కార్యాలయాలను స్వయంగా సందర్శించి పురోగతిని సమీక్షిస్తానని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.