కర్నాటక ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్

కర్నాటక ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్, జేడీఎస్​లు ఒకటే అని, లోపాయికారి ఒప్పందంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని బీజేపీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఎన్నికల ప్రచారం కోసం కర్నాటకను ఏటీఎంలా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నదని ఆరోపించారు. కర్నాటకలోని ముళబాగిల నియోజకవర్గంలో కోలార్ ఎంపీ మునిస్వామి, అభ్యర్థి సుందర్​తో కలిసి సంజయ్ ప్రచారం నిర్వహించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నందున ప్రచారం స్పీడప్ చేయాలని పార్టీ నేతలను కోరారు. ఒక్కో ఓటర్​ను ఐదుసార్లు కలవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధిని వివరించాలన్నారు. అదేవిధంగా బెంగళూరులోనూ సంజయ్​ ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ఎస్ఆర్​విశ్వనాథ్​ను గెలిపించాలంటూ అభ్యర్థించారు. తర్వాత పార్టీ లీడర్లతో సమావేశమై ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే విశ్వనాథ్ చేసిన కృషిని ఓటర్లకు వివరించాలన్నారు. తర్వాత యలహంకలోని కొందరు బీజేపీ కార్యకర్తల ఇండ్లకు వెళ్లారు. బీజేపీ సీనియర్ లీడర్ ఈశ్వరప్ప, ఏఎస్ రాజన్నతో పాటు పలువురిని బండి సంజయ్ కలిశారు.

‘మన్ కీ బాత్’ను సక్సెస్ చేయాలి

‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్​ను విజయవంతం చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు. బెంగళూరు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేంద ర్​ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీన ర్లు, శక్తి కేంద్రాల ఇన్​చార్జ్​లతో పాటు మోర్చాల రాష్ట్ర, జిల్లా స్థాయి లీడర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మన్​కీ బాత్ ఎక్కువ మంది చూసేలా ప్లాన్ చేయాలని, ఇందులో తెలంగాణ టాప్​లో నిలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్​లో 100 కేంద్రాల్లో సగటున 100 మంది హాజరయ్యేలా చూడాలన్నారు. భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సంజయ్​ సూచించారు.