సంస్కరణల్లో దేశానికి చర్లపల్లి జైలు ఆదర్శం : మంత్రి బండి సంజయ్

సంస్కరణల్లో దేశానికి చర్లపల్లి జైలు ఆదర్శం : మంత్రి బండి సంజయ్
  • కేంద్రం మంత్రి బండి సంజయ్​ అభినందన.. జైలు సందర్శన
  • ఖైదీల ఉత్పత్తులు పరిశీలన

హైదరాబాద్‌‌,వెలుగు:  ఖైదీల సంక్షేమంలో, సంస్కరణల్లో చర్లపల్లి సెంట్రల్‌‌ జైలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు బీమా సౌకర్యంతో పాటు వారి కుటుంబసభ్యులకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించడం అభిందనీయమని పేర్కొన్నారు. జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రను అభినందించారు. కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్​ సోమవారం చర్లపల్లి జైలును సందర్శించారు. ఖైదీలతో నిర్వహిస్తున్న చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. 

గోశాలలోని ఓ లేగ దూడకు ‘కృష్ణ’ అని పేరు పెట్టారు. మహిళా ఖైదీల పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తూ ఫీజులను కూడా జైళ్ల శాఖ చెల్లించడం గొప్ప విషయమని బండి సంజయ్​ అన్నారు. ఖైదీల కోసం జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఖైదీల కుటుంబ సభ్యులకు వీడియో లింక్ ద్వారా తాము ఉన్న ప్రాంతాల నుంచి మాట్లాడే (ములాఖత్) అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. 

ఖైదీలు చదువుకునేందుకు విస్తృత అవకాశాలు కల్పించడంతో పాటు చదువు పూర్తయ్యాక డిగ్రీలు కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. రోజూ సగటున 150 మందికి వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు, ప్రతి రోగికి ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్‌‌ను రూపొందించినట్లు అధికారులు వివరించారు. ఖైదీలకు స్కిల్ డెవలప్‌‌మెంట్‌‌తో పాటు వివిధ రంగాల్లో ఉపాధి కల్పిస్తున్నట్లు, వారు విడుదలైన తర్వాత పెట్రోలు బంకుల్లో ఉద్యోగాలు కల్పిస్తూ ప్రతి నెలా రూ. 18 వేల చొప్పున కనీస వేతనాలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.