
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్ల,ఎలక్షన్ స్టంట్‌ను తలపిస్తోందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోతో పాటుగా, పలు సందర్భాలలో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ చివరి ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు ఈసారి కూడా మొండి చేయి ఎదురైందన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధులకు పొంతనే లేదని సంజయ్ చెప్పారు. ప్రతిపాదిత బడ్జెట్‌లో 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయని కేసీఆర్ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. ‘మాటలు కోటలు దాటుతున్నయ్.. చేతలు గడప దాటడం లేదు’అనే సామెతకు అద్దం పడుతోందన్నారు. ఈ బడ్జెట్ గురించి సీఎం మాటాల్లో చెప్పాలంటే "సరుకు లేదు, సంగతి లేదు!.. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు!.. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు!.. అంతా వట్టిదే డబ్బ!.. బభ్రాజమానం భజగోవిందం!!" అంటూ సంజయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.