
హైదరాబాద్,వెలుగు: బీజేపీపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ అని, దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ అని తెలిపారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న బీజేపీ.. ఒకరు చెబితేనే నిర్ణయం తీసుకునే పార్టీ కాదన్నారు. రామచంద్రరావు పేరును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఖరారు చేయడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు.
సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో సంజయ్ మాట్లాడారు. బండి సంజయ్ ఉంటేనే పార్టీ ఉన్నట్లు, లేకపోతే లేనట్లు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదన్నారు. ఎవరూ లేకపోయినా పార్టీ నడస్తుందని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎవరైనా నామినేషన్ వేయవచ్చు. అధ్యక్షుడు కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ, అన్ని విషయాలను పరిశీలించి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది.
ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉంటుంది” అని పేర్కొన్నారు. ఇక బీసీకి ప్రెసిడెంట్ పదవి ఎందుకివ్వలేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, మరి బీసీకి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ము కేసీఆర్కు ఉందా? అని ప్రశ్నించారు. కాగా, బనకచర్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడినవన్నీ డ్రామాలేనని స్పష్టమైందని సంజయ్ అన్నారు. బనకచర్ల విషయంలో తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందని ఆ పార్టీలు గగ్గోలు పెట్టాయని, తాజాగా కేంద్ర నిర్ణయంతో యూటర్న్ తీసుకున్నాయని విమర్శించారు.