టీఆర్ఎస్ కారణంగానే  దళిత బంధు ఆగింది

టీఆర్ఎస్ కారణంగానే  దళిత బంధు ఆగింది

 

  • బీజేపీని గెలిపిస్తేనే  దళిత బంధు సహా అన్నీ ఇప్పిస్తాం

టీఆర్ఎస్ కారణంగానే  దళిత బంధు ఆగిందని నిరూపించేందుకు నేను సిద్ధమని సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దళిత బంధు ఆపడానికి బీజేపీ కారణమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు.లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేస్తావా? అని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుశాపూర్ లో మాట్లాడిన బండి సంజయ్..ఈ విషయాన్ని..... యాదాద్రి దగ్గర తేల్చుకుందామని కేసీఆర్ కు సవాల్ విసిరారు.

టీఆర్ఎస్ పతనం ఖాయమైందని..బీజేపీని గెలిపిస్తేనే కేసీఆర్ మెడలు వంచి దళిత బంధుసహా అన్నీ ఇప్పిస్తామన్నారు బండి సంజయ్.ఎన్నికల తర్వాత  కేసీఆరే తన మనుషులతో కోర్టులో కేసు వేయించి దళిత బంధు డబ్బులు దళితులకు అందకుండా చేస్తాడని ఆరోపించారు. కరోనాతో రాష్ట్రం అల్లాడుతుంటే మన సీఎం మాత్రం ఫాంహౌస్  లో పడుకుని పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందనుకున్నాడని చెప్పారు. ఆయనకు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి పోయి చికిత్స చేయించుకున్నాడని అన్నారు. 

రాష్ట్రంలో ఆరోగ్య శ్రీకి డబ్బులివ్వలేదని... కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయలేదని తెలిపారు బండి. జనం చస్తున్నా పట్టించుకోలేదన్నారు. చివరకు చనిపోయిన వారి సంఖ్య కూడా  దాచి.. శవాలను మాయం చేశారన్నారు. హుజురాబాద్  ఎలక్షన్ రాగానే మెల్లగా బయటకొచ్చి దళితవాడ తిరుగుడు స్టార్ట్ చేసిండన్నారు.హుజురాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమని సీఎం కేసీఆర్ కూడా అర్ధమై పోయిందని..అందుకే సోయి తప్పి ఏం చేస్తుండో ఆయనకే అర్ధమైతలేదన్నారు. ఓడిపోతామనే భయంతో ‘దళిత బంధు’ ప్రకటిస్తే.. . మేం ఆహ్వానించి.. రాష్ట్రమంతా ఇవ్వాలన్నామని తెలిపారు. హైదరాబాద్ లో భూములమ్మి వచ్చిన సొమ్ముతో హుజురాబాద్ లో దళిత బంధు ఇస్తామని ఆశ చూపిండన్నారు. అన్ని సర్వేల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తేలిపోవడంతో దళితులకు డబ్బులెందుకు ఇయ్యాలని చెప్పి అకౌంట్లు ఫ్రీజ్ చేయించాడని అన్నారు. మొన్న చేయించుకున్న సర్వేలో ఎట్లాగూ ఓడిపోతున్నామని తెలిసి మొత్తానికే ఇవ్వకూడదని  డిసైడ్ అయ్యాడని తెలిపారు. అందుకే దళిత లబ్ది దారుల్లో ఒక్కరి చేతికి కూడా పైసలందకుండా చేసిండన్నారు.

ఎన్నికల కమిషన్ దళిత బంధును తాత్కాలికంగా ఆపేయమని చెప్పగానే .. బీజేపీ కారణంగానే దళిత బంధు ఆగిందని మామీద నెపం నెడుతున్నాడని అన్నారు బండిసంజయ్.  హైదరాబాద్ ఎన్నికల్లో నా పేరు మీద దొంగ లేఖ సృష్టించి బండి సంజయ్ వరద సాయం ఆపమని లేఖ రాయడంవల్లే పేదోళ్లకు అందాల్సిన వరద సాయం ఆగిపోయిందని ప్రచారం చేసిండన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామా మొదలు పెట్టిండని... బీజేపీ లేఖ రాసినందువల్లే ఎలక్షన్ కమిషన్ దళిత బంధును ఆపేసిందని చెబుతున్నారన్నాని.. అంతా అబద్దం అన్నారు.