17 స్థానాల్లో గెలుపు కోసమే ప్రజాహిత యాత్ర: బండి సంజయ్

17 స్థానాల్లో గెలుపు కోసమే ప్రజాహిత యాత్ర: బండి సంజయ్

జగిత్యాల/కొండగట్టు/కోరుట్ల, వెలుగు : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు గెలవడమే ప్రజాహిత యాత్ర ముఖ్య ఉద్దేశమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. అయోధ్యలో ప్రజల భాగస్వామ్యంతో రాముడి గుడి కట్టి మోడీ ప్రజల గుండెల్లో మహనీయుడిగా నిలిచాడని, ఆయన మూడో సారి ప్రధాని కావడం ఖాయమన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి, పీవీ నరసింహారావు ఫొటోకు నివాళులర్పించిన సంజయ్ ​ప్రజాహిత యాత్ర ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి గతంలో 150 రోజుల పాటు1600 కిలోమీటర్ల మేర గాంధీయాత్ర, ప్రజా సంగ్రామ యాత్రలు చేశానని.. యాత్రలు చేయని వారే ప్రజలను మోసం చేస్తారన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.12 వేల కోట్లతో ఎన్నో పనులు చేశానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ​ప్రభుత్వాన్ని ఓడించి కేసీఆర్​కు రెస్ట్ ఇవ్వడంతో ఫామ్ హౌజ్​లో తాంత్రిక పూజలు చేస్తున్నాడన్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..ఎన్నికల హామీలు నెరవేర్చడానికి రూ.53 వేల కోట్లు నిధులు సరిపోతాయని చెప్పడం విడ్డూరమని, కనీసం రూ. 5 లక్షల కోట్లు కావాలన్నారు. మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్, బీఆర్ఎస్ అవమానపరిచాయని, బీజేపీ భారత రత్న ఇచ్చి గౌరవించిదన్నారు. మేడిపల్లి మండలం మీదుగా కథలాపూర్ మండలంలోని  సిరికొండ వరకు యాత్ర చేపట్టారు. అంతకుముందు కొండగట్టు అంజన్న ఆలయంలో పూజలు చేశారు. మోరపల్లి సత్యనారాయణ , ప్రతాప రామకృష్ణ, వేములవాడ నియోజకవర్గ లీడర్ వికాస్ రావు, కోడిపల్లి గోపాల్ రెడ్డి, మధుకర్, సురభి నవీన్ ఉన్నారు.