ఏపీ, తెలంగాణ సీఎంలు కాంట్రాక్టులు పంచుకుంటున్రు : బండి సంజయ్

ఏపీ, తెలంగాణ సీఎంలు కాంట్రాక్టులు పంచుకుంటున్రు : బండి సంజయ్

జగిత్యాల : ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరూ ఒక్కటేనని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.  వాళ్లిద్దరు కలిసి కాంట్రాక్టులు పంచుకుంటున్నారని ఆరోపించారు. ఏపీ వాళ్లకి తెలంగాణలో... తెలంగాణ వాళ్ళకి ఏపీలో కాంట్రాక్టులు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందన్నారు.  జగిత్యాలలో బండి సంజయ్ 12వ రోజు పాదయాత్ర ముగిసింది. యూసుఫ్ నగర్ శివార్లలో ఆయన బస చేశారు.  ‘‘కేసీఆర్ కు చేతకాకపోతే... ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని 250 కోట్ల రూపాయలు పెట్టి తెరిపించే బాధ్యతను మేం తీసుకుంటాం. కేసీఆర్ నాకు చేతకాదు అని లెటర్ రాసిస్తే చాలు’’ అని సంజయ్ వ్యాఖ్యానించారు.  బెంగళూరులో డిపాజిట్ కూడా సాధించలేని వ్యక్తిని నమ్ముకొని కేసీఆర్ కొత్త పార్టీ జపం చేస్తుండటం విడ్డూరంగా ఉందని కామెంట్ చేశారు. 

క్యాసినో వ్యాపారాల్లో కూడా కవిత పెట్టుబడులు పెట్టారని ఆయన ఆరోపించారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి కేసీఆర్ ప్రకటించిన 100 కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. బాసర అమ్మవారి ఆలయ అభివృద్ధికి 120 కోట్ల రూపాయలన్న కేసీఆర్... నేటికీ ఒక్క రూపాయి విడుదల చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కొండగట్టు అభివృద్ధికి రూ. 100 కోట్లు అని కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పారు.