నా కొడుకు తప్పు చేస్తే వంద శాతం శిక్ష పడాల్సిందే

నా కొడుకు తప్పు చేస్తే  వంద శాతం శిక్ష పడాల్సిందే
  • చట్టం ఎవరికీ చుట్టం కాదు.. అందరికీ సమానమే: 
  • జనం కోసం ఆలోచించి నా కొడుకుకు నేను టైమివ్వలేదు
  • అదే నేను చేసిన పొరపాటు.. క్షమించండి 
  • బండి సంజయ్‌ని గెలికారు.. 
  • మీరు పెట్టిన నిప్పుతో అవినీతి, కుటుంబ వ్యవస్థను దహనం చేస్తానని కామెంట్​

కరీంనగర్, వెలుగు:  సమాజంలో చట్టం ఎవరికీ చుట్టం కాదని, అందరికీ సమానమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌ అన్నారు. తన  కొడుకు తప్పు చేస్తే తప్పకుండా వంద శాతం శిక్ష పడాల్సిందేనని పేర్కొన్నారు. ఇయ్యాల తన కొడుకుకు ఒక రకమైన చట్టం.. వేరొకరికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ కాదని అన్నారు. కరీంనగర్‌‌‌‌లోని టవర్ సర్కిల్ ఏరియాలో మంగళవారం రాత్రి నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో శ్రీజగద్గురు శంకరాచార్య హంపి పీఠాధిపతి శ్రీవిద్యారణ్య భారతి స్వామి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు.

 యాత్ర ప్రారంభానికి ముందు వేలాది మంది కాషాయ శ్రేణులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. తన కొడుకు భగీరథ్‌‌పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కొడుకు గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. ‘‘ఏ ఇంట్లో కష్టమొచ్చినా పెద్ద కొడుకునై అండగా ఉన్నా. మీ కోసం ఆలోచించి, మీ మనిషిగా ఆలోచించి నా కొడుకుకు టైమివ్వలేదు. నా కొడుకుతో మాట్లాడలేదు.  అదే నేను చేసిన పొరపాటు.. క్షమించండి. నా కొడుకును క్రిమినల్ లెక్క సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్ల భరిస్తానో ఒక్కసారి ఆలోచించండి. నేనేం తప్పు చేయలే నాన్నా.. మేం ఫ్రెండ్స్‌‌మి నాన్నా.. కలిసి ఉన్నం.. తర్వాత విడిపోయినం.. నేనేం తప్పు చేయలే.. నిజాయితీగా బయటికొస్తా.. అని చెప్పి ఇయ్యాల నా కొడుకు చెప్తుండు.  నిజానిజాలు కోర్టులు తేలుస్తాయి. తప్పు చేసినట్లు తేలితే శిక్ష అనుభవించాల్సిందే. అయినా నేను సమర్థించడం లేదు. తప్పు ఎవరు చేసినా, నా కొడుకైనా సరే, ఎవరైనా సరే చట్టం ముందు సమానులే” అని వ్యాఖ్యానించారు.   

అవినీతి గడీలను కూల్చివేస్తా..

ఇయ్యాల తాను ఏ దారిలో పోతున్నానో.. తన భార్య సైతం అదే దారిలో వస్తున్నదని బండి సంజయ్‌‌ తెలిపారు.  ‘‘నా భార్య బ్యాంకులో ఉద్యోగం చేసేది. బ్యాంకు కస్టమర్లకంటే  పనుల కోసం, సాయం కోసం కార్యకర్తలే బ్యాంకుకు ఎక్కువగా వస్తున్నారని లీవ్ పెట్టింది. ఈ రోజు కార్యకర్తలంతా సాయం కోసం నా కంటే ఎక్కువగా నా భార్య దగ్గరికి పోతరు. పెళ్లిళ్లు, హాస్పిటల్ ఖర్చులకు సాయం అడిగి తీసుకెళ్తరు. ఈ రోజు ఆ కన్నపేగు డిప్రెషన్‌‌లోకి పోతున్నది. 

పరోక్షంగా, ప్రత్యక్షంగా దాడి చేస్తుంటే తల్లడిల్లిపోతున్నది. ఈ రోజు నా కొడుకు సంఘటనే ఇంత ఇబ్బంది పెడతుంటే.. 29 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. ఆ రోజు వారికి అండగా ఉన్నది బండి సంజయ్ మాత్రమే. శ్రీరామ చంద్రుడికే  అరణ్యవాసం తప్పలేదు. శ్రీరామచంద్రుడే నాకు ఆదర్శం. కష్టాలను భరిస్తా. ఆనాడు రాక్షసులు ఆంజనేయస్వామికి నిప్పంటిస్తే ఏమైంది? లంకా దహనమైంది. నేను హనుమంతుడి భక్తుడిని. నన్ను గెలికారు. నా కుటుంబానికి నిప్పంటించారు. ఆ నిప్పుతో అవినీతికి పాల్పడుతూ కుట్రలు చేసే వాళ్ల సామ్రాజ్యాన్ని దహనం చేస్తా. అవినీతి గడీలను కూల్చివేస్తా. నా కుటుంబాన్ని, పార్టీని బజారున పడేసినవాళ్లను ఏ ఒక్కరినీ వదిలిపెట్ట. రాక్షస సంతతి సవాల్​ చేస్తున్నది.. కార్యకర్తలు సిద్ధం కావాలి’’ అని అన్నారు.

హిందూ ధర్మం కోసమే పనిచేస్త.. 

తాను కంట తడి పెట్టే రకంకాదని బండి సంజయ్‌‌ పేర్కొన్నారు. ‘‘మీరే నా కుటుంబం. సమాజమే నా ఇల్లు అనుకున్న. హార్ట్‌‌లో స్టంట్ ఉన్నా హార్ట్ ఫుల్‌‌గా 1600 కిలోమీటర్లు నడిచిన. తెలంగాణ ప్రజల కష్టాలను పంచుకున్న. నాటి పాలకులు నాపై రాళ్ల దాడి చేసినా.. 109 కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడలే. నేను భయపడ. కరీంనగర్ గడ్డ రక్తం నాలో ప్రవహిస్తుంది. కరీంనగర్‌‌‌‌లో గల్లీగల్లీలో ప్రజా సమస్యలపై కొట్లాడిన. నా ప్రస్థానం చిన్న కార్యకర్తగా మొదలైంది. 

నా జీవితం కష్టాలు, బాధలే. బాధలను చూసి భయపడి పారిపోయేటోడ్ని కాను. టవర్ సర్కిల్‌‌పై కాషాయ జెండాను ఎగరేశాం. హిందువుల ఐక్యతను చాటేందుకే 16 ఏండ్లుగా హిందూ ఏక్తా యాత్ర చేస్తున్నా. జై శ్రీరాం అనే నినాదమే హిందూ ధర్మాన్ని కాపాడుతుంది. హిందూ సమాజానికి ఆపదొస్తే జై శ్రీరాం నినాదంతో తెగించి కొట్లాడతాం. నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తా’’ అని బండి సంజయ్‌‌ స్పష్టం చేశారు.