కేసీఆర్‎కు మైలేజీ కావాలి కానీ మంచి చెడు అవసరం లేదు

కేసీఆర్‎కు మైలేజీ కావాలి కానీ మంచి చెడు అవసరం లేదు

సీఎం కేసీఆర్‎కు మైలేజీ కావాలి కానీ మంచి చెడు అవసరం లేదని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్యేలకు, వారి కొడుకులకు అరాచకాలు చేయమని కేసీఆర్ లైసెన్స్ ఇచ్చినట్లున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన అండతోనే రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయని సంజయ్ మండిపడ్డారు. శంషాబాద్ నోవాటల్‎లో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘కేసీఆర్ నీ పార్టీ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం వల్ల ఒక కుటుంబం నాశనం అయింది. అయినా నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? తప్పు చేసిన వారిని ఎందుకు కాపాడుతున్నావు? ఎమ్మెల్యే కొడుకు అయినా, ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షపడాలి. క్రిమినల్ ఎవరైనా క్రిమినల్‎గానే చూడాలి. వెంటనే వనమా రాఘవపై యాక్షన్ తీసుకోవాలి. వనమా రాఘవకు బహిరంగ శిక్ష వేయాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే కఠిన శిక్ష పడాలి. ఒక కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న ఎమ్మెల్యే కొడుకు ఘనకార్యాన్ని తెరాస నేతలు ఖడించకపోవడం దారుణం, చాలా బాధాకరం. బీజేపీ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.. వనమా రాఘవకు శిక్ష పడేవరకు పోరాడుతం’ అని సంజయ్ అన్నారు.

సోషల్ మీడియా తెరాస సొంతమా?

యూట్యూబ్ ఛానల్ వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేయడంపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా తెరాస సొంతమా... వాళ్ళు ఏవైనా పోస్ట్ చేయొచ్చా? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని ఆయన అన్నారు. ‘మా దగ్గర ఒక వ్యక్తి కేసీఆర్‎ను తిట్టే ప్రయత్నం చేస్తే నేనే ఆపిన. మాకు సంస్కారం ఉంది. మేం కుటుంబాలను తిట్టం. అరెస్ట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్ట్‎లను వెంటనే విడుదల చేయాలి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు సూచనలు చేయండి కానీ వారిని హింసించకండి. వారి పొట్ట కొట్టకండి. జర్నలిస్ట్‎ల మీద వెంటనే దాడులు ఆపాలి’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

For More News..

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ ప్రభుత్వం అరుదైన గౌరవం

కీచక రాఘవ ఎక్కడ?