
బషీర్ బాగ్, వెలుగు: ఎంపీ బండి సంజయ్‌ను బీజేపీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావుగౌడ్ డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిని ఉద్దేశించి సంజయ్పరుష పదజాలంతో మాట్లాడారని, ఇలాంటి వ్యక్తులకు రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లేదన్నారు. శనివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో నిర్వహించిన సంఘం సమావేశంలో లక్ష్మణ్‌రావు గౌడ్పాల్గొని మాట్లాడారు. నిత్యం దైవ నామ స్మరణ, ఆలయాల సందర్శన, హైందవ సంస్కృతి సంప్రదాయాలను పాటించే నిఖార్సైన హిందువు పొన్నం ప్రభాకర్అనే విషయాన్ని బండి సంజయ్, బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.
రాజకీయ లబ్ధి కోసం దేవుడి పాట పాడే నకిలీ భక్తుడు బండి సంజయ్ అని విమర్శించారు. అతని బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు వసూళ్ల రాజకీయాలు అందరికీ తెలుసన్నారు. బండి సంజయ్ కామెంట్లను బీజేపీ శ్రేణులు కూడా అసహ్యించుకుంటున్నాయని, రాష్ట్ర ప్రజలందరూ సంజయ్‌ను ఛీ కొడుతున్నారన్నారు. సంజయ్ ను పార్టీ నుంచి బహిష్కరించకపోతే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. సంజయ్‌పై చర్యలు తీసుకోకుంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క బీసీ ఓటు కూడా పడదన్నారు. బీసీలు ఐక్యంగా బీజేపీ ఓటమికి కృషి చేస్తారని లక్ష్మణ్ రావు హెచ్చరించారు.