కేసీఆర్ అమరవీరులను అవమానిస్తుండు

కేసీఆర్ అమరవీరులను అవమానిస్తుండు

మజ్లిస్ పార్టీ అంటే కేసీఆర్కు భయమని,అందుకే తెలంగాణ విమోచన దినం నిర్వహించడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకుండా అమర వీరులను ఘోరంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. సీఎం పీఠమెక్కిన అనంతరం మాట తప్పారని ఆరోపించారు. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకపోవడానికి అసలు కారణమేంటో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

విమోచన దినోత్సవాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. విలీన వజ్రోత్సవాల పేరుతో కేసీఆర్ మరో జిమ్మిక్కుకు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణవాది అయితే గతంలో ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.