రెవెన్యూ వ్యవస్థపై కక్షగట్టిన కేసీఆర్ 

రెవెన్యూ వ్యవస్థపై కక్షగట్టిన కేసీఆర్ 

వీఆర్ఓల విషయంలో రాష్ట్రప్రభుత్వ వైఖరిని బీజేపీ జాతీయాధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 22 నెలలుగా వీఆర్ఓలను రోడ్డు పాల్జేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు లాటరీల ద్వారా ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు జీవో జారీ చేయడం వారిని అవమానించడమేనని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ వీఆర్ఓలను దొంగలుగా చిత్రీకరించారని మండిపడ్డారు. 

కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసినా రెవెన్యూ శాఖలో ఒక్క వీఆర్ఓ పోస్టు కూడా కొత్తగా క్రియేట్ చేయలేదని బండి సంజయ్ విమర్శించారు. అశాస్త్రీయమైన ధరణి వెబ్ సైట్ లో తప్పులను ఎత్తి చూపుతారన్న ఉద్దేశంతోనే వీఆర్ఓ వ్యవస్థను తొలగించారని మండిపడ్డారు. భూస్వామ్య మనస్తత్వం కలిగిన కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, అందుకే 8ఏళ్లుగా పెత్తందారీ మనస్తత్వంతో పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. 

కేసీఆర్ హయాంలో దళిత, బడుగు, బలహీనవర్గాల పరిస్థితి చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా మారిందని బండి సంజయ్ వాపోయారు. సర్పంచులకు అధికారాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రి.. ఎంపీటీసీ, జెడ్పీటీసీల అధికారాలను నామమాత్రంగా మార్చారని, చివరకు గ్రామ కార్యదర్శులకు కూడా మనశ్శాంతి లేకుండా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే జీవో నెంబర్ 121 ను ఉపసంహరించుకుని వీఆర్ఓలందరికీ పోస్టింగ్ లు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.