దేశానికి ఎమర్జెన్సీ ఓ మాయని మచ్చ : బండి సంజయ్​

దేశానికి ఎమర్జెన్సీ ఓ మాయని మచ్చ : బండి సంజయ్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికార దాహానికి ఎమర్జెన్సీ నిదర్శనమని, దేశ పాలన చరిత్రలో అది ఓ మాయని మచ్చ అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అధికారాన్ని నిలుపుకోవడానికి ఎన్ని అడ్డదారులైన తొక్కేందుకు, చివరకి ప్రజల ప్రాణాలను తీసేందుకు కూడా ఆ పార్టీ వెనుకాడదనేందుకు ఎమర్జెన్సీ ఉదాహరణ అని అన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 

దేశంలో ఎమర్జెన్సీ పాలనకు 50 ఏండ్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు. 1975 జూన్ 25 నుంచి 21 నెలలపాటు ఎమర్జెన్సీ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దేశ ప్రజల గొంతును నొక్కేశారని ఆరోపించారు. ఎమర్జెన్సీ కాలంలో సంజయ్ గాంధీ బృందం చేసిన అరాచకాలకు అంతులేదన్నారు. ఎమర్జెన్సీ పాలనతో విసిగిన ప్రజలు కాంగ్రెస్ ను ఓడించినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాకపోవడం సిగ్గు చేటని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కాంగ్రెస్ కూలదోసిందని ఆరోపించారు.