కేసీఆర్​ను మళ్లీ గెలిపిస్తే రాముడు అయోధ్యలో పుట్టలేదంటడు: బండి సంజయ్

కేసీఆర్​ను మళ్లీ గెలిపిస్తే రాముడు అయోధ్యలో పుట్టలేదంటడు: బండి సంజయ్
  • పటాన్​చెరు మీదుగా ఖేడ్​కు రైల్వే లైన్: సంజయ్​
  • కాంగ్రెస్ కు చాలా చోట్ల డిపాజిట్లు రావని వెల్లడి

నారాయణ్ ఖేడ్, వెలుగు: కేసీఆర్ ను మూడోసారి గెలిపిస్తే రాముడు అయోధ్యలో పుట్టలేదని అంటాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు.  కేసీఆర్ కు దమ్ముంటే ఓవైసీ కి బొట్టు పెట్టి హనుమాన్ టెంపుల్ లో హనుమాన్ చాలీసా చదివించాలన్నారు. ఆదివారం నారాయణ ఖేడ్ లో నిర్వహించిన రోడ్ షోలో బీజేపీ అభ్యర్థి సంగప్ప, కర్నాటక ఎమ్మెల్యే ప్రభు చౌహన్ తో కలిసి మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో 1400 మంది యువకుల చావులకు కాంగ్రెస్ కారణమైంది. 

ఆ పార్టీకి చాలా చోట్ల డిపాజిట్లు కూడా రావు. కల్వకుంట్ల కుటుంబ పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం అయింది, అలాంటిది నారాయణఖేడ్ నియోజకవర్గంలో 70 సంవత్సరాల నుండి మూడు కుటుంబాల పాలన ఎట్లా భరిస్తున్నరు. ఫ్యాక్షన్ రాజకీయాలకు ముగింపు పలకాలి, మధ్యతరగతి మనిషి సంగప్పకు బీజేపీ అవకాశం ఇచ్చింది, ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి” అని అన్నారు. నిజాంపేట్ టు బీదర్ హైవే రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని, నారాయణఖేడ్ ను ఇండస్ట్రీస్ హబ్ గా చేసి, పటాన్​చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గం మీదుగా రైల్వే లైన్ తీసుకొస్తామన్నారు. 

లింగాయత్, ఆరే మరాఠీలను ఓబీసీ జాబితాలో చేర్చే ప్రక్రియ 90 శాతం పూర్తయిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఉచిత విద్య వైద్యం అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ల పేరు చెప్పి మోసం చేశాడని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ, వాళ్ల ఇంట్లో ఆరు ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. నారాయణఖేడ్​లో కూడా రంగస్థలం మొదలైందని మూడు ఎకరాల మామూలు మనిషికి మూడు వేల ఎకరాల భూస్వాములకు మధ్య పోటీ జరుగుతుందన్నారు. కచ్చితంగా బీసీ ఓటర్ల సహకారంతో సంగప్ప గెలిచి నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాడన్నారు.