బకాసురుల రాజ్యాన్ని అంతం చేస్తం..రామరాజ్యం తెస్తం: బండి సంజయ్

బకాసురుల రాజ్యాన్ని అంతం చేస్తం..రామరాజ్యం తెస్తం: బండి సంజయ్
  • రామరాజ్య స్థాపనే లక్ష్యంగా పని చేస్తం: బండి సంజయ్
  • హిందుగాళ్లు బొందుగాళ్లన్న వాళ్లను బొందపెట్టిన గడ్డ కరీంనగర్
  • రాష్ట్రంలో హిందుత్వం లేదనే వాళ్లకు ఈ యాత్రకు వచ్చిన జనమే సమాధానం
  • తిలక్ స్ఫూర్తితోనే హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని వెల్లడి
  • దేశంలో త్వరలో యూనిఫాం సివిల్ కోడ్: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ
  • మా రాష్ట్రంలో ఫస్ట్​కే జీతాలిస్తున్నం.. ఇక్కడ పదో తారీఖు వచ్చినా ఇయ్యట్లేదని విమర్శ

కరీంనగర్, వెలుగు:తెలంగాణలో రజాకార్ల, బకాసురుల రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పని చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. హిందువులను సంఘటితం చేసేందుకు వినాయక ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్ నిర్వహించినట్లే.. తెలంగాణలో హిందువులను సంఘటితం చేసేందుకు హిందూ ఏక్తా యాత్ర చేపట్టామని చెప్పారు. కర్నాటకలో హిందుత్వాన్ని కాపాడే పార్టీ అధికారం కోల్పోవడం వల్లే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అక్కడ నినాదాలు చేసే దుస్థితి నెలకొందని అన్నారు. కరీంనగర్‌‌‌‌లో ఆదివారం రాత్రి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో కలిసి ఆయన హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. హిందుగాళ్లు బొందుగాళ్లన్న వాళ్లను బొందపెట్టిన గడ్డ కరీంనగర్ అని అన్నారు.

కరీంనగర్ వేదికగా హిందూ సమాజానికి సేవ చేసే అదృష్టం రావడం తన పూర్వ జన్మ సుకృతమని కొనియాడారు. ‘‘నేను ఏడుసార్లు జైలుకు వెళ్లింది రాజకీయాల కోసం కాదు. కేవలం హిందూ సమాజానికి హాని చేసే వాళ్లతో పోరాడే జైలుకెళ్లిన. తెలంగాణవ్యాప్తంగా హిందుత్వ వాతావరణం తీసుకొస్త. కుహనా లౌకికవాదుల ఆటకట్టించడానికే ఏక్తా యాత్ర చేపట్టా. కర్నాటక ఎన్నికల్లో ఓడిపోయేసరికి హిందుత్వం మాట్లాడొద్దని అంటున్నారు. హిందుత్వం మాట్లాడితే అధికారంలోకి పార్టీ రాదని అంటున్నారు. అలాంటోళ్లంతా ఈ యాత్రకు వచ్చిన హిందూ ధర్మ రక్షకులను చూసి మాట్లాడాలి” అని అన్నారు.

ఉగ్రవాదులకు ఉద్యోగాలిస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పాలి

ఒక్క రాష్ట్రంలో బీజేపీ గెలవకపోతే ఏమైతదని, 15కుపైగా రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బండి సంజయ్ అన్నారు. ‘‘15 నిమిషాలు టైమిస్తే మనల్ని చంపుతానన్న వాళ్లను రోడ్లమీద ఉరికించడానికి ఇంకా 5 నెలలే టైం ఉంది. హిందుత్వం అనేది లేకపోతే ఈ దేశం ముక్కలయ్యేది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గాన్ అయ్యేది. హిందుత్వం లేకుండా భారత్ లేదు” అని చెప్పారు. నిన్నగాక మొన్న ఎంఐఎం లీడర్ల మెడికల్ కాలేజీలో ఓ ఉగ్రవాదిని హెచ్ఓడీగా నియమించుకున్నారంటే పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించాలని ప్రజలను సంజయ్ కోరారు. అట్లాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ట్రిపుల్ తలాఖ్‌‌ను రద్దు చేసి ముస్లిం మహిళల కోసం మోడీ మంచి నిర్ణయం తీసుకుంటే ఎంఐఎం నాయకులు ఎందుకు స్పందించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియెట్‌‌లో నల్లపోచమ్మ గుడికి రెండున్నర గుంటలే స్థలం ఇచ్చారని, 80 శాతం జనాభా ఉన్న హిందువుల వాటా సచివాలయంలో రెండున్నర గుంటలేనా అని ప్రశ్నించారు. సచివాలయం హిందువులదేనని.. నల్ల పోచమ్మ గుడిని స్వర్ణ దేవాలయంగా మార్చే అవకాశం తమకివ్వాలని కోరారు.

నిజాం సమాధి వద్ద మోకరిల్లిన సీఎం కేసీఆర్

తెలంగాణ.. నిజాం మెడలు వంచిన ప్రాంతమని, కానీ నిజాం సమాధి వద్దకు పోయి కేసీఆర్ మోకరిల్లిండని బండి సంజయ్ మండిపడ్డారు. నిజాం మనవడు ఎక్కడో ఇస్తాంబుల్​లో చనిపోతే ఇక్కడ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేశారని.. అట్లాంటి సీఎంకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ‘‘లవ్ జిహాద్ గురించి చెబితే బీజేపోళ్లకు, భజరంగ్ దళ్ వాళ్లకు ఏం పనిలేదని విమర్శించారు. ఈ రోజు కేరళలో హిందువులపై ఎలా దాడులు జరుగుతున్నాయో, లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి ఎట్లా నరక కూపంలోకి నెడుతున్నారో అద్దం పట్టేలా కేరళ స్టోరీ తీశారు. వాళ్లకు హ్యాట్సాఫ్. హిందువుల్లో ఐక్యత లేదని, ఓటు బ్యాంకు కాదని.. ఎవడెన్ని మొరిగినా మేం పట్టించుకోబోం” అని అన్నారు.

ఒవైసీ ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తా: హిమంత బిశ్వ శర్మ

‘‘370 ఆర్టికల్ రద్దవుతుందని ఎవరూ అనుకోలేదు. కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ దాన్ని రద్దు చేసింది. అలాగే దేశంలో మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురాబోతున్నాం”అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం అవుతుందని అన్నారు. లవ్ జిహాద్‌‌ను అరికట్టేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ‘‘మా రాష్ట్రంలో ఆరు వేల మదర్సాలను బంద్ చేయించాం. దీంతో ఒవైసీ నా సంగతి చూస్తానని బెదిరించారు. వచ్చే ఏడాది మరో వెయ్యి మదర్సాలనూ మూసివేస్తా. ఒవైసీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తా. ఆయన ఇంటికి కూడా వస్తా. ఏం చేస్తాడో చూస్తా” అని సవాల్ విసిరారు. అస్సాంలో రూ.98కే పెట్రోల్ వస్తుందని, కానీ తెలంగాణలో రూ.108 ఉందని విమర్శించారు. తమ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఫస్ట్ తారీఖునే వస్తుందని, తెలంగాణలో పదో తారీఖు దాటినా రావడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 50 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం పేరు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. ప్రభుత్వ పెద్దలు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు” అని ఆరోపించారు. బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒకటేనని, బీఆర్ఎస్ ఇక వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. హిందువులంతా కేరళ స్టోరీ చూడాలని, హిందూ యువతులను ఉగ్రవాదులుగా ఎలా మారుస్తున్నారో అందులో చూపించారని తెలిపారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.