
- కార్పొరేషన్‌కు రూ.26 కోట్ల మేర ఆదాయం
- ఆగస్టు 1,2 తేదీల్లో పోచారంలో 600 ఫ్లాట్లు వేలం
హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ రాజీవ్ స్వగృహ గేటెడ్ కమ్యూనిటీల్లోని ఫ్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది. సింగిల్, డబుల్, త్రిబుల్‌బెడ్‌రూం ఫ్లాట్ల కోసం భారీ ఎత్తున దరఖాస్తులు రాగా.. అధికారులు లాటరీ తీసి ఫ్లాట్లను కేటాయించారు. మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేసేందుకు.. ఆ వర్గాలకు అందుబాటులో ఉండే ధరలతో రూ.15 లక్షలు,- రూ.18 లక్షలకే సింగిల్, డబుల్బెడ్రూం ఫ్లాట్లను ప్రభుత్వం అందుబాటులోకి తేవడంతో వాటికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో బుధవారం రాత్రి పొద్దు పోయేంత వరకు లాటరీ నిర్వహించి ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ విక్రయాల ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు సుమారు రూ.26 కోట్ల మేర ఆదాయం వచ్చిందని ఎండీ గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా బండ్లగూడ ప్రధాన రహదారి మొత్తం దరఖాస్తుదారుల కోలాహలం కనిపించింది.
బండ్లగూడ ప్రాంతంలో ఫ్లాట్లు దక్కనివారు నిరాశ చెందకుండా.. ఇక్కడి రశీదుతోనే పోచారం ప్రాంతంలోని ఫ్లాట్లకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నదని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం తెలిపారు.
159 ఫ్లాట్లకు 2,084 దరఖాస్తులు
బండ్లగూడ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వివిధ రకాలైన మొత్తం 2,746 ఫ్లాట్లను నిర్మించింది. ఇందులో ఖాళీగా ఉన్న 159 ఫ్లాట్ల విక్రయానికి ఈ నెలలో నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా, 11 త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్లకు 1,325 దరఖాస్తులు, 19 డబుల్బెడ్రూం ఫ్లాట్లకు 525, 105 సింగిల్ బెడ్ రూం ఫ్లాట్లకు 234 దరఖాస్తులు వచ్చాయి.
వీటిలో 131 ఫ్లాట్లను బుధవారం లబ్ధిదారులకు కేటాయించారు. అయితే, కొన్ని ఫ్లాట్లకు ఒక దరఖాస్తు మాత్రమే రాగా, వారికే ఫ్లాట్లను కేటాయించారు. సీనియర్ సిటిజెన్స్ కోసం ప్రత్యేకించిన 9 ఫ్లాట్లు, 19 సింగిల్బెడ్రూం ఫ్లాట్లు మినహా మిగిలిన అన్ని ఫ్లాట్లను ప్రజలు కొనుగోలు చేశారు. తొలుత సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకించిన ఫ్లాట్ల కేటాయింపుతో ప్రారంభించి, అటు తరువాత సింగిల్ బెడ్రూం, డబుల్ బెడ్రూం, త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్ కేటాయింపు ప్రక్రియను చేపట్టారు.
ఈ లాటరీ ప్రక్రియనంతటినీ యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. రాత్రి పొద్దు పోయేంత వరకు ఈ లాటరీ ప్రక్రియ కొనసాగింది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో ఈఈ నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఉప్పల్ తహసీల్దార్ టి.వాణి రెడ్డి, ఆర్ఐ అశ్వనీ గౌడ్ లాటరీ నిర్వహించారు.
పోచారంలో 595 ఫ్లాట్లు
ఘట్ కేసర్ పోచారం ప్రాంతంలో సింగిల్బెడ్రూం ఫ్లాట్లు (రూ.13 లక్షలు) 255, డబుల్ బెడ్రూం ఫ్లాట్లు (రూ.19 లక్షలు) 340 ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు ప్రక్రియ నేటితో (గురువారం) ముగియనుంది. ఆగస్టు 1,2 తేదీల్లో లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయించనున్నారు.
=======================================================
, latest News, Telugu News, Telangana Nes, Hyderabad News
బీసీ బిల్లుల ఆమోదం కోసం కవిత నిరాహార దీక్ష
వచ్చే నెల 4 నుంచి 72 గంటల పాటు ఇందిరా పార్క్ వద్ద ధర్నా
హైదరాబాద్, వెలుగు: బీసీ బిల్లుల ఆమోదం కోసం ఆగస్టు 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు 72 గంటల పాటు (మూడు రోజులు) ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఆమె విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని కవిత విమర్శించారు. బీసీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలుపకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయపోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కాగా, దీక్షకు అనుమతి ఇవ్వాలని సెంట్రల్ జోన్ డీసీపీకి దరఖాస్తు చేశారు.