కొత్త పంటల సాగు విధానంపై ఏం స్టడీ చేశారు?

కొత్త పంటల సాగు విధానంపై ఏం స్టడీ చేశారు?

హైదరాబాద్, వెలుగుప్రభుత్వం చెప్పిన పంటలే రైతులు వేయాలనడం సీఎం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ఏ స్టడీ ప్రకారం షరతుల ఎవుసం విధానాన్ని తెచ్చారని, ఏ పంట పండించాలనే దానిపై శాస్త్రీయ విధానాలను అధ్యయనం చేశారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం అలా చెప్పడం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయని, రైతుబంధు పథకాన్ని బంద్ చేసేందుకే కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. రాష్ట్రంలో కేవలం వరి, పత్తి, కందులు లాంటి పంటలే వేయాలని ఎలా చెబుతున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సీఎం చెప్పిన పంటలే వేస్తే… రైతులకు మద్దతు ధర లభిస్తుందా? అని సంజయ్ ప్రశ్నించారు. మద్దతు ధరకు తోడు బోనస్ ఇచ్చే గ్యారంటీ తనదేననే కేసీఆర్ రైతులకు హామీ ఇవ్వగలరా? అని అడిగారు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నేతలు, కిసాన్ మోర్చా నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. షరతుల ఎవుసం, రైతుబంధు, రుణమాఫీ తదితర అంశాలపై చర్చించారు.

ముందు భూసార పరీక్షలు చేయండి

రాష్ట్రంలోని రైతులకు భూసార కార్డులు జారీ చేసి, దానికి అనుగుణంగా పంట మార్పిడి చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.125 కోట్లు ఇచ్చిందని సంజయ్ తెలిపారు. అయితే ఆ ఫండ్స్ ను సీఎం కేసీఆర్ దారి మళ్లించారని ఆరోపించారు. ఆ నిధులను దేనికి ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కేసీఆర్ కు ఉంటే ముందు భూసార పరీక్షలు చేయించాలని సూచించారు. ఆ తర్వాత రైతులకు భూసార కార్డులు జారీ చేసి, ఏ పంట సాగుకు ఏ భూములు అనుకూలమో నిర్ధారించి, షరతుల ఎవుసం విధానాన్ని అమలు చేయాలన్నారు. కానీ సీఎం ఇలాంటివేం చేయకుండానే.. ప్రభుత్వం చెప్పిన పంటలనే వేయాలని ఆదేశిస్తూ ఫ్యూడల్ విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు.

షరతుల ఎవుసాన్ని అడ్డుకుంటం

అగ్రికల్చర్ సైంటిస్టులు, ఎక్స్ పర్ట్స్,  రైతు సంఘం ప్రతినిధులతో త్వరలో మీటింగ్ నిర్వహిస్తామని సంజయ్ తెలిపారు.  రైతులను ఆదుకునేందుకు, వారికి అండగా నిలిచేందుకు బీజేపీ తరఫున చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. సీఎం చెప్పిన షరతుల ఎవుసాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని, దాని అమలును అడ్డుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలను తమ పార్టీ స్వాగతిస్తుందని, అయితే శాస్త్రీయ పద్ధతుల్లో పంట మార్పిడికే అనుకూలమని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనా రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, సుగుణాకర్ రావు, గోలి మధుసూదన్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, సంకినేని వెంకటేశ్వర్ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

 

తొక్కు పెట్టినోళ్లకు కరోనా..ఊరుఊరంతా హైరానా