చెలరేగిన కోహ్లీ..చెన్నైకి ఐదో ఓటమి

చెలరేగిన కోహ్లీ..చెన్నైకి ఐదో ఓటమి

కాస్త ఆలస్యంగా ఫామ్‌‌లోకి వచ్చిన బెంగళూరు కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ  (52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 నాటౌట్‌‌)  ఐపీఎల్‌‌లో అదరగొడుతున్నాడు. వరుసగా మూడో మ్యాచ్‌‌లోనూ పంజా విసిరాడు. తనలోని హిట్టర్‌‌ను నిద్రలేపుతూ చెన్నై బౌలర్లపై  విరుచుకుపడ్డాడు. స్టార్టింగ్‌‌లో స్లోగా ఆడినా.. ఆఖర్లో సిక్సర్ల వర్షం కురిపించి జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఆపై బౌలర్లంతా కట్టదిట్టంగా బంతులేసి సూపర్‌‌ కింగ్స్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ భరతం పట్టారు. దాంతో ఆర్‌‌సీబీ లీగ్‌‌లో నాలుగు విక్టరీ ఖాతాలో వేసుకుంది..! ఇక మరోసారి చెత్త బ్యాటింగ్‌‌తో విసుగుపుట్టించిన సీఎస్‌‌కే  ఐదో పరాజయంతో మరింత డీలా పడింది..!

దుబాయ్‌‌:లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో టేబుల్‌‌ టాపర్‌‌ ఢిల్లీ క్యాపిటల్స్‌‌ చేతిలో ఘోర ఓటమి నుంచి రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు వెంటనే కోలుకుంది. విరాట్‌‌ కోహ్లీ కెప్టెన్‌‌ ఇన్నింగ్స్‌‌కు తోడు బౌలర్ల సమష్టి పెర్ఫామెన్స్‌‌తో శనివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో37  పరుగుల తేడాతో చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌పై గ్రాండ్‌‌ విక్టరీ  సాధించింది.  తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 రన్స్‌‌ చేసింది. ఛేజింగ్‌‌లో  సీఎస్‌‌కే 20 ఓవర్లలో 8 వికెట్లకు 132  పరుగులే చేసి  చిత్తుగా ఓడింది. అంబటి రాయుడు (40 బంతుల్లో 4 ఫోర్లతో 42) ), అరంగేట్రం ప్లేయర్‌‌ ఎన్‌‌. జగదీశన్‌‌ (28 బంతుల్లో 4 ఫోర్లతో 33) మాత్రమే కాస్త పోరాడారు. ఆర్‌‌సీబీ బౌలర్లలో క్రిస్‌‌ మోరిస్‌‌ (3/19), సుందర్‌‌ (2/18) సత్తా చాటారు.  కోహ్లీకి మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది.

కోహ్లీ స్టన్నింగ్‌‌ షో..

బెంగళూరు ఇన్నింగ్స్‌‌లో కెప్టెన్‌‌ విరాట్‌‌ ఆటే హైలైట్‌‌. ఆఖర్లో అతని ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌ వల్లే జట్టు మంచి స్కోరు చేసింది. అయితే, టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్‌‌ స్లాగ్‌‌ ఓవర్ల వరకూ పెద్దగా మెరుపుల్లేకుండా చాలా చప్పగా సాగింది.  ఓపెనర్‌‌ ఆరోన్‌‌ ఫించ్‌‌ (2)ను థర్డ్‌‌ ఓవర్లో అద్భుత ఇన్‌‌స్వింగర్‌‌తో బౌల్డ్‌‌ చేసిన దీపక్‌‌ చహర్‌‌ (1/10)  చెన్నైకి ఫస్ట్‌‌ బ్రేక్‌‌ ఇచ్చాడు. మరో ఓపెనర్‌‌ పడిక్కల్‌‌ (33) తో కలిసి కెప్టెన్‌‌ విరాట్‌‌ జాగ్రత్తగా ఆడడంతో పవర్‌‌ప్లేలో 36 రన్సే వచ్చాయి.  ఆ తర్వాత బ్రావో (0/29), కర్ణ్‌‌ శర్మ (0/34)  కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో  బౌండ్రీలు కొట్టలేకపోయారు. అయితే, కర్ణ్‌‌ శర్మ వేసిన పదో ఓవర్లో లాంగాన్‌‌ మీదుగా భారీ సిక్సర్‌‌ రాబట్టిన పడిక్కల్‌‌ స్పీడు పెంచే ప్రయత్నం చేశాడు.  కానీ, 13వ ఓవర్లో శార్దుల్‌‌ ఠాకూర్‌‌ (2/40) ఆ జట్టును గట్టి దెబ్బకొట్టాడు. ఫామ్‌‌లో ఉన్న పడిక్కల్‌‌తో పాటు డేంజర్‌‌ మ్యాన్‌‌ ఏబీ డివిలియర్స్‌‌  (0)ను ఔట్‌‌ చేశాడు. ఈ టైమ్‌‌లో  వాషింగ్టన్‌‌ సుందర్‌‌ (10), కోహ్లీ చెరో సిక్సర్‌‌తో ఎదురుదాడికి దిగారు. కానీ, కరన్‌‌  (1/48) బౌలింగ్‌‌లో సుందర్‌‌ కాట్‌‌ బిహైండ్‌‌ కావడంతో ఇన్నింగ్స్‌‌ మళ్లీ డీలా పడింది. 16వ ఓవర్‌‌కు గానీ స్కోరు వంద దాటలేదు. ఈ లెక్కన ఆర్‌‌సీబీ 140 రన్స్‌‌ చేస్తే గొప్పే అనిపించింది. కానీ, చివరి నాలుగు ఓవర్లలో  కోహ్లీ ఒక్కసారిగా టాప్‌‌ గేర్‌‌లోకి వచ్చేశాడు. భారీ షాట్లతో చెలరేగాడు.  ఠాకూర్‌‌ బౌలింగ్‌‌లో దూబే (14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 22 నాటౌట్‌‌), కోహ్లీ చెరో బౌండ్రీ రాబట్టి 17 రన్స్‌‌ పిండుకున్నారు. ఆపై, కరన్‌‌ వేసిన 18వ ఓవర్లో విరాట్‌‌ మూడు సిక్సర్లు బాదడంతో ఏకంగా 24 రన్స్‌‌ లభించాయి. ఫస్ట్‌‌ సిక్సర్‌‌కు బౌండ్రీ లైన్‌‌ వద్ద జగదీశన్ క్యాచ్‌‌ డ్రాప్‌‌ చేయడంతో కోహ్లీకి లైఫ్‌‌ వచ్చింది. దీన్ని యూజ్‌‌ చేసుకున్న అతను  ఠాకూర్‌‌ బౌలింగ్‌‌లోనూ మరో సిక్సర్‌‌, బ్రావో వేసిన లాస్ట్‌‌ ఓవర్లో ఓ బౌండ్రీ సహా 14 రన్స్‌‌ రాబట్టాడు. ఓవరాల్‌‌గా చివరి నాలుగు ఓవర్లలో 66 రన్స్‌‌ వచ్చాయి. ఫిఫ్టీకి 39 బాల్స్​ తీసుకున్న విరాట్​ మరో 13 బాల్స్​లోనే 40 రన్స్​ రాబట్టడం విశేషం.

చెన్నై మళ్లీ ఢమాల్‌‌

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో  చెన్నై తడబడింది. పవర్‌‌ప్లేలో 26 పరుగులే చేసిన ఆ జట్టు  ఓపెనర్లు వాట్సన్‌‌ (14), డుప్లెసిస్‌‌ (8) వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలు పెట్టింది. ఈ ఇద్దరినీ వరుస ఓవర్లో  స్పిన్నర్‌‌ సుందర్‌‌ ఔట్‌‌ చేశాడు. అతనితో పాటు చహల్‌‌ (1/35), మోరిస్‌‌,  సైనీ (0/18), ఉడాన (1/30) కట్టడి చేయడంతో పది ఓవర్లలో  47 పరుగులే వచ్చాయి. అయితే, క్రీజులో కుదురుకున్నాక రాయుడు, జగదీశన్ ఇద్దరూ స్వేచ్ఛగా బౌండ్రీలు కొడుతూ రన్‌‌రేట్‌‌ పెంచారు. చహల్‌‌ బౌలింగ్‌‌లో జగదీశన్‌‌ రెండు ఫోర్లు బాదగా… దూబే వేసిన 14వ ఓవర్లో చెరో  ఫోర్‌‌తో ఇన్నింగ్స్‌‌కు ఊపు తెచ్చారు. ఈ క్రమంలో అంబటికి అదృష్టం కూడా తోడైంది. ఫించ్‌‌ విసిరిన  త్రో మిస్సవడంతో రనౌటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. కానీ, తర్వాతి ఓవర్లో క్రిస్‌‌ మోరిస్‌‌ మెరుపు వేగంతో జగదీశన్‌‌ను రనౌట్‌‌ చేయడంతో థర్డ్‌‌ వికెట్‌‌కు 64 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయింది. అప్పుడే మ్యాచ్‌‌ ఆర్‌‌సీబీ చేతుల్లోకి వచ్చేసింది.  కెప్టెన్‌‌ ధోనీ (10) మళ్లీ ఫెయిలయ్యాడు. వచ్చీరాగానే చహల్‌‌ బౌలింగ్‌‌లో లాంగాన్‌‌ మీదుగా సిక్సర్‌‌ కొట్టిన మహీ  మరో షాట్‌‌ ఆడి బౌండ్రీ లైన్‌‌ వద్ద గుర్‌‌కీరత్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో 106/4తో చెన్నై కష్టాలు పెరిగాయి. చివరి నాలుగు ఓవర్లలో 64 రన్స్‌‌ అవసరం అవగా రాయుడు క్రీజులో ఉండడంతో  ఆ జట్టు ఆశలు కోల్పోలేదు. కానీ, మోరిస్‌‌ బౌలింగ్‌‌లో కీపర్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చిన సామ్‌‌ కరన్‌‌ (0) డకౌటవగా.. ఉడాన వేసిన తర్వాతి ఓవర్లో ప్యాడిల్‌‌ స్వీప్‌‌ చేయబోయి రాయుడు బౌల్డ్‌‌ అవడంతో జట్టు ఓటమి
ఖాయమైంది.

బెంగళూరు: దేవదత్‌ పడిక్కల్‌‌ (సి) డుప్లెసిస్‌‌ (బి) శార్దూల్‌‌ 33, ఆరోన్ ఫించ్‌‌ (బి) దీపక్ చహర్‌‌ 2, కోహ్లీ (నాటౌట్‌‌) 90, డివిలియర్స్‌‌ (సి) ధోనీ (బి) శార్దూల్‌‌ 0, సుందర్ (సి) ధోనీ (బి) కరన్‌‌ 10, దూబే (నాటౌట్) 22; ఎక్స్‌‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 169/4; వికెట్లపతనం: 1–13, 2–66, 3–67, 4–93; బౌలింగ్‌‌: దీపక్ చహర్‌‌ 3–0–10–1, కరన్‌‌ 4–0–48–1, శార్దూల్‌‌ 4–0–40–2, బ్రావో 3–0–29–0, కర్ణ్‌‌ శర్మ 4–0–34–0, జడేజా 2–0–7–0.

చెన్నై: వాట్సన్‌‌ (బి) సుందర్‌‌ 14, డుప్లెసిస్‌‌ (సి) మోరిస్‌‌ (బి) సుందర్‌‌ 8, అంబటి రాయుడు (బి) ఉడాన 42, జగదీశన్‌‌ (రనౌట్‌‌/మోరిస్‌‌) 33, ధోనీ (సి) గుర్‌‌కీరత్‌‌ (బి) చహల్‌‌ 10, సామ్ కరన్‌‌ (సి) డివిలియర్స్‌‌ (బి) మోరిస్‌‌ 0, జడేజా (సి) గుర్‌‌కీరత్‌‌ (బి) మోరిస్‌‌ 7, బ్రావో (సి) పడిక్కల్‌‌ (బి) మోరిస్‌‌ 7,  దీపక్ చహర్‌‌ (నాటౌట్‌‌) 5, శార్దుల్‌‌  ఠాకూర్ (నాటౌట్) 1; ఎక్స్‌‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 132/8; వికెట్ల పతనం: 1–19, 2–25, 3–89, 4–106, 5–107, 6–113, 7–122, 8–126;  బౌలింగ్‌‌:  క్రిస్ మోరిస్‌‌ 4–0–19–3, నవదీప్ సైనీ 4–0–18–0, ఉడాన 4–0–30–0, వాష్టింగ్టన్ సుందర్‌‌ 3–0–16–2, చహల్‌‌ 4–0–35–1, శివమ్ దూబే 1–0–14–0.