
- 35 వేల అప్పు తీర్చలేదని దారుణానికి తెగబడ్డ వ్యాపారి
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
- నిందితుడితో పాటు మరో నలుగురు అరెస్ట్
ఢాకా: రూ.35 వేలు అప్పు తీర్చలేదని బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై స్థానిక రాజకీయ నేత ఫజర్ అలీ(36) అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ది చేయగా తప్పించుకుని పారిపోయాడు. గురువారం బంగ్లాదేశ్‌లోని కొమిల్లా జిల్లా రామ్‌చంద్రపూర్ పాంచ్కిట్ట గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తాయి. దీంతో పోలీసులు ప్రధాన నిందితుడు అలీతోపాటు, మరో నలుగురిని సోమవారం అరెస్ట్ చేశారు.
మైనార్టీలపై దాడుల పట్ల ఆందోళనలు..
తీసుకున్న అప్పు తీర్చలేదని ఫజర్ అలీ జూన్26న రాత్రి 11 గంటల ప్రాంతంలో బాధితురాలి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పిల్లలతో కలిసి ఒంటరిగా ఉన్న బాధితురాలు.. తలుపు తీసేందుకు నిరాకరించింది. దీంతో మరింత ఆవేశానికి గురైన ఫజర్ అలీ తలుపులు పగలగొట్టుకుని లోపలికి వెళ్లి మహిళను చితకబాదాడు. ఆమెను నగ్నంగా చేసి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి కేకలు విని అక్కడికి చేరుకున్న చుట్టుపక్కలవాళ్లు నిందితుడిని చితకబాదారు.
అయితే, ఫజర్ అలీ వారి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న కొందరు.. నిస్సహాయ స్థితిలో పడిఉన్న బాధితురాలిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కాగా, బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు రక్షణ లేదంటూ దేశవ్యాప్తంగా పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పోలీసులు కేసు ఫైల్ చేసి, ఢాకాలో దాక్కున్న నిందితుడు అలీని,వీడియో తీసిన నలుగురిని అరెస్ట్ చేశారు.