ఇండియా పర్యటనకు బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా

ఇండియా పర్యటనకు బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా
  • బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా

ఢాకా: కరోనా టైంలో ఇండియా ఎంతో సాయం చేసిందని, ప్రధాని మోడీ ప్రభుత్వం వ్యాక్సిన్​ ఇచ్చి చాలా మంది ప్రాణాలను కాపాడిందని బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా అన్నారు. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధానికి దిగిన టైంలో కూడా బంగ్లాదేశీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చిందని గుర్తుచేశారు. సోమవారం షేక్​ హసీనా ఇండియా పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియా చేసిన హెల్ప్​ను గుర్తు చేశారు.  ‘‘వ్యాక్సిన్​ మైత్రి” ప్రోగ్రాం లాంచ్​ చేసి పొరుగున ఉన్న అన్ని దేశాలకు సాయం చేసిందని కొనియాడారు. 

పోలెండ్ నుంచి తీసుకొచ్చారు..
రష్యా–ఉక్రెయిన్​ వార్​ టైంలో పోలెండ్​లో చిక్కుకుపోయిన బంగ్లాదేశ్​ స్టూడెంట్లను ఇండియా స్వదేశానికి చేర్చిందని ప్రధాని షేక్​ హసీనా తెలిపారు. ఈ సాయం ఎప్పటికీ మరిచిపోలేమని, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వివరించారు. రెండు దేశాల మధ్య ఎంత బలమైన ఫ్రెండ్​షిప్​ ఉందో.. దీంతోనే అర్థం అవుతుందన్నారు. 

రోహింగ్యాలతో అంతర్గత సవాళ్లు
రెండు దేశాల మధ్య అన్ని రంగాల్లో మంచి సహాయ సహకారాలు ఉన్నాయని ప్రధాని షేక్​ హసీనా గుర్తు చేశారు. ఇండియా, బంగ్లాదేశ్​ మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా.. వాటిని చర్చలతో పరిష్కరించుకునేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తామని వివరించారు. 1971 వార్​లో ఎంతో హెల్ప్​ చేసిందని, ఈ యుద్ధంలో తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయానని గుర్తు చేశారు. బంగ్లాదేశ్​లో 10లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారని, వారితో అంతర్గతంగా సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. వారు స్వస్థలాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఇతర దేశాలతో చర్చిస్తున్నామని వివరించారు. ఇండియా పెద్ద దేశమని, కొంతమంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చని అన్నారు.