
ఢాకా: అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాను బుధవారం జైలు నుంచి రిలీజ్ చేశారు. మాస్క్ వేసుకుని, వీల్ చైర్‌పై బయటకు వచ్చిన జియాకు ఆమె పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. కరోనా విజృంభిస్తున్నందువల్ల బంగ్లాదేశ్ ప్రధాని హసీనా షేక్ ఆదేశాల మేరకు రిలీజ్ చేశామని, ఆరు నెలల పాటు ఇంట్లోనే ఉండాలన్న కండిషన్ పెట్టామని హోం మినిస్టర్ అసాదుజ్జామ్ ఖాన్ కమల్ చెప్పారు. ఈ ఆరు నెలలు ఆమె ఎలాంటి పొలిటికల్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్నందువల్ల ఖలీదాను రిలీజ్ చేయాలని కోరుతూ ఆమె తమ్ముడు ఎస్కాండర్, చెల్లి సెలిమా అపీల్ చేయగా.. న్యాయపరమైన విషయాలను రివ్యూ చేసిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని లాయర్లు చెప్పారు. మూడుసార్లు బంగ్లా ప్రధానిగా పనిచేసిన ఖలీదాకు 17 ఏళ్ల జైలు శిక్ష పడింది.