
- రాణించిన లిటన్ దాస్, తౌహిద్
- నిజాకత్, జీషాన్ శ్రమ వృథా
అబుదాబి: చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో నిలకడగా ఆడిన బంగ్లాదేశ్.. ఆసియా కప్‌లో బోణీ చేసింది. లిటన్ దాస్ (39 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 59), తౌహిద్ హ్రిదోయ్ (36 బాల్స్‌లో 1 ఫోర్‌తో 35 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో.. గురువారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో హాంకాంగ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడిన హాంకాంగ్ 20 ఓవర్లలో 143/7 స్కోరు చేసింది. నిజాకత్ ఖాన్ (40 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 42), జీషాన్ అలీ (30), కెప్టెన్ యాసిమ్ ముర్తజా (28) మెరుగ్గా ఆడారు. తర్వాత బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 144/3 స్కోరు చేసింది. లిటన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బౌలింగ్ అదుర్స్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్‌ను బంగ్లా బౌలర్లు కట్టడి చేశారు. ఒకరిద్దరు మెరుగ్గా ఆడినా మిగతా వారు నిరాశపర్చడంతో హాంకాంగ్ భారీ స్కోరు చేయలేకపోయింది. రెండో ఓవర్‌లోనే టస్కిన్ అహ్మద్ (2/38).. అన్షి రాత్ (4)ను ఔట్ చేయగా, ఐదో ఓవర్‌లో తన్జిమ్ హసన్ షకీబ్ (2/21).. బాబర్ హయత్ (14)ను పెవిలియన్‌కు పంపాడు. 30/2 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన నిజాకత్ ఖాన్.. జీషాన్ అలీకి అండగా నిలిచాడు. 34/2తో పవర్‌ప్లేను ముగించిన ఈ ఇద్దరు సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ బంగ్లా బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు.
9వ ఓవర్‌లో జీషాన్ 6, 4 బాదాడు. ఆ వెంటనే మరో ఫోర్ కొట్టడంతో ఫస్ట్ టెన్‌లో హాంకాంగ్ 64/2 స్కోరు చేసింది. జోరుమీదున్న జీషాన్‌ను 12వ ఓవర్‌లో తన్జిమ్ బోల్తా కొట్టించాడు. మూడో వికెట్‌కు 41 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. యాసిమ్ ముర్తజా ధనాధన్ బ్యాటింగ్‌లో ఫోర్లు, సిక్స్ బాదాడు. దాంతో స్కోరు 15 ఓవర్లలో 101/3కి పెరిగింది. 17వ ఓవర్‌లో నిజాకత్, యాసిమ్ చెరో ఫోర్‌తో జోరు పెంచారు. అయితే 18వ ఓవర్‌లో యాసిమ్ అనూహ్యంగా రనౌట్ కావడంతో నాలుగో వికెట్‌కు 46 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. నిజాకత్ 6, 4 కొట్టి 19వ ఓవర్‌లో వెనుదిరిగాడు. వరుస విరామాల్లో కించిత్ షా (0), ఐజాజ్ ఖాన్ (5) ఔట్‌కావడంతో హాంకాంగ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు
హాంకాంగ్: 20 ఓవర్లలో 143/7 (నిజాకత్ ఖాన్ 42, జీషాన్ అలీ 30, తన్జిమ్ 2/21).
బంగ్లాదేశ్: 17.4 ఓవర్లలో 144/3 (లిటన్ దాస్ 59, తౌహిద్ 35*, అతీక్ ఇక్బాల్ 2/14).
ఈజీగా ఛేజ్..
ఛేజింగ్‌లో బంగ్లాకు ఆరంభంలో ఇబ్బందులు ఎదురైనా తర్వాత కుదురుకుంది. తొలి ఓవర్‌లోనే పర్వేజ్ ఎమన్ (19) రెండు ఫోర్లు ఆ తర్వాత సిక్స్‌తో టచ్‌లోకి వచ్చాడు. కానీ మూడో ఓవర్‌లో ఆయుష్ శుక్లా (1/32).. ఎమన్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌కు 24 రన్స్‌ను బ్రేక్ చేశాడు. లిటన్ దాస్ నిలకడగా ఆడినా తన్జిద్ హసన్ (14) నిరాశపర్చారు.
ఆరో ఓవర్‌లో అతీక్ ఇక్బాల్ (2/14)కు వికెట్ ఇచ్చాడు. దాంతో బంగ్లా 51/2 స్కోరుతో పవర్‌ప్లేను ముగించింది. లిటన్‌తో కలిసి తౌహిద్ హ్రిదోయ్ మెరుగ్గా ఆడాడు. సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదారు. ఫలితంగా తర్వాతి నాలుగు ఓవర్లలో 23 రన్స్ రావడంతో ఫస్ట్ టెన్‌లో బంగ్లా 74/2 స్కోరు చేసింది. ఆ తర్వాత కూడా హాంకాంగ్ బౌలర్ల నుంచి ఏమాత్రం ప్రతిఘటన లేకపోవడంతో లిటన్, తౌహిద్ మూడో వికెట్‌కు 95 రన్స్ జోడించి గెలిపించారు.