బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలకు ముహుర్తం ఫిక్స్: ముహమ్మద్ యూనస్ కీలక ప్రకటన

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలకు ముహుర్తం ఫిక్స్: ముహమ్మద్ యూనస్ కీలక ప్రకటన

ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలకు ముహర్తం ఖరారు అయ్యింది. ఈ మేరకు బంగ్లా తాత్కలిక ప్రధాని మహ్మమద్ యూనస్ పార్లమెంట్ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన విద్యార్థుల "జూలై తిరుగుబాటు" ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం (ఆగస్ట్ 5) జాతినుద్దేశించి మహ్మమద్ యూనస్ ప్రసగించారు. 

ఈ సందర్భంగా ఆయన తదుపరి బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలపై ప్రకటన చేశారు. 2026 ఫిబ్రవరిలో రంజాన్ మాసం ప్రారంభానికి ముందు బంగ్లా పార్లమెంట్‎కు ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 2026 ఫిబ్రవరిలో బంగ్లా పార్లమెంట్ ఎన్నికల నిర్వహించాలని అభ్యర్థిస్తూ ఎన్నికల కమిషన్‎కు తాను లేఖ రాస్తానని చెప్పారు. ఎన్నికలను నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని దేశ ప్రజలకు భరోసా కల్పించారు. 

ఈ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధిక ఓటింగ్ శాతంతో నమోదు అయ్యే విధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్‎లో కీలకమైన యువత, మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద పీట వేయాలని పొలిటికల్ పార్టీలకు సూచించారు. కాగా, 2024 జూలై, ఆగస్టులో ప్రభుత్వ రిజర్వేషన్ల వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. 

ఈ ఆందోళనలు చిలికి చిలికి గాలి వానలా మారి.. దేశమంతా వ్యాపించాయి. విద్యార్థుల నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. అప్పటి నుంచి మహ్మమద్ యూనస్ నేతృత్వంలోని తాత్కలిక ప్రభుత్వం బంగ్లాను రూల్ చేస్తోంది. అయితే, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించి పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆర్మీ, పొలిటికల్ పార్టీస్, ప్రజల నుంచి డిమాండ్లు వస్తుండటంతో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని తాత్కలిక ప్రభుత్వం నిర్ణయించింది.