
- ఇంట్రాడేలో ఏడాది గరిష్టాన్ని తాకిన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు
- రిలయన్స్ నష్టాలకు బ్రేక్
- జపాన్- అమెరికా ట్రేడ్ డీల్‌తో పెరిగిన ఆసియా మార్కెట్లు
ముంబై: బ్యాంకింగ్ , ఆయిల్ షేర్లలో భారీ కొనుగోళ్లు, ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవ్వడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ బుధవారం 539.83 పాయింట్లు (0.66శాతం) ఎగసి 82,726.64 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్టంగా 599.62 పాయింట్లు (0.72శాతం) పెరిగి 82,786.43 లెవెల్‌కు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 159 పాయింట్లు (0.63శాతం) పెరిగి 25,219.90 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్‌లోని 50షేర్లలో 37 లాభపడగా, 13 నష్టపోయాయి. సెన్సెక్స్ కంపెనీలలో టాటా మోటార్స్ 2.51శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది.
భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ పాజిటివ్‌గా ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్టాన్ని తాకాయి. ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. గత ఐదు రోజుల నష్టాల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ బుధవారం లాభాల్లో కదిలింది. ఈ కంపెనీ షేరు 0.83శాతం పెరిగింది. మరోవైపు హిందుస్తాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐటీసీ షేర్లు మాత్రం నష్టాలు చవిచూశాయి.
ఆసియాలో జోరు..
అమెరికాతో జపాన్ ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆసియా మార్కెట్లు బుధవారం సానుకూలంగా కదిలాయి. జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ 3.51శాతం ఎగసింది. ఈ ఒప్పందంలో భాగంగా జపాన్ నుంచి చేసుకునే దిగుమతులపై 15 శాతం టారిఫ్‌ను అమెరికా విధిస్తుంది. దక్షిణ కొరియా కోస్పీ, షాంఘై ఎస్‌ఎస్‌ఈ కాంపోజిట్, హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్ లాభాలతో ముగిశాయి. ఆశికా ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ ప్రకారం, ‘‘అమెరికా–-జపాన్ ట్రేడ్ ఒప్పందంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.
రాబోయే అంతర్జాతీయ ఒప్పందాలపై అంచనాలు పెరిగాయి”అని వివరించింది. కాగా, యూరోపియన్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. యూఎస్ మార్కెట్లు మిశ్రమంగా కదిలాయి. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మంగళవారం నికరంగా రూ.3,548.92 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా, బుధవారం మరో రూ.2,400 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. బ్రెంట్ క్రూడ్ 0.45శాతం తగ్గి బ్యారెల్‌కు 68.29 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. డాలర్ బలపడడం, విదేశీ పెట్టుబడులు మార్కెట్ నుంచి వెళ్లిపోవడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ ఆరో రోజు కూడా క్షీణించింది. 3 పైసలు తగ్గి 86.41 వద్ద ముగిసింది.
మరిన్ని ట్రేడ్ డీల్స్ కుదురుతాయనే ఆశ
జూన్ క్వార్టర్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ భారత ఈక్విటీ మార్కెట్ నిలకడగా ఉందని, అమెరికా–-జపాన్ ట్రేడ్ ఒప్పందం పట్ల ఆశావాదం, భారత్–-యూకే ఎఫ్‌టీఏలో పురోగతి వంటివి మార్కెట్ పెరుగుదలకు సాయపడ్డాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు. వాల్యుయేషన్లు ఎక్కువగా ఉన్నాయనే ఆందోళనలు ఉన్నప్పటికీ, మార్కెట్ మాత్రం లాభపడుతోంది.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ బుధవారం 0.24శాతం, స్మాల్‌క్యాప్ 0.05శాతం పెరిగాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లలో టెలికమ్యూనికేషన్ (1.14శాతం), ఆటో (0.86శాతం), బ్యాంకెక్స్ (0.75శాతం), టెక్ (0.74శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (0.70శాతం), హెల్త్‌కేర్ (0.70శాతం), ఎనర్జీ (0.65శాతం) రంగాలు లాభపడ్డాయి. రియల్టీ (2.60శాతం), ఎఫ్‌ఎంసీజీ (0.46శాతం), క్యాపిటల్ గూడ్స్ (0.31శాతం), సర్వీసెస్ (0.20శాతం) నష్టపోయాయి.