డీసీసీబీ చైర్మన్​ సీటుపై పంతం!

డీసీసీబీ చైర్మన్​ సీటుపై పంతం!
  • ఇన్​చార్జి చైర్మన్, డైరెక్టర్ల మధ్య ఆధిపత్య పోరు
  • కొత్త చైర్మన్​ఎన్నిక నిర్వహించాలని డిమాండ్లు 
  • ఇప్పటికే మూడుసార్లు మీటింగ్ లు వాయిదా 
  • మంత్రుల జోక్యంతోనే పరిష్కారమనే అభిప్రాయాలు
  • పాలకవర్గం గడువు మరో నాలుగు నెలలు

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్​ (డీసీసీబీ)లో చైర్మన్​ సీటుపై డైరెక్టర్ల పంతంతో బ్యాంకు పాలన పక్కనపడింది. ప్రస్తుతం ఇన్​చార్జి చైర్మన్​ వర్సెస్​ డైరెక్టర్లుగా పరిస్థితి మారింది. చైర్మన్​ కుర్చీ కావాలని పంతం పట్టిన వాళ్లంతా కాంగ్రెస్​ లోనే ఉండడంతో ఈ సమస్య పరిష్కారానికి జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. చైర్మన్​ ఎన్నిక కోసం 14 మంది డైరెక్టర్లు ఇప్పటికే నోటీస్​ ఇచ్చి నెల రోజులు దాటుతున్నా.. దాన్ని మీటింగ్ ఎజెండాలో చేర్చకపోవడం వివాదానికి కారణమైంది. 

ఈ ఇష్యూతో పాటు మరో మూడ్నాలుగు అంశాలపై ఇన్​చార్జి చైర్మన్, అధికారుల​తీరును వ్యతిరేకిస్తూ డైరెక్టర్లు ఇటీవల రెండు సార్లు జరిగిన సర్వసభ సమావేశాలను బాయ్​కాట్ చేశారు. ఒకసారి మీటింగ్ కు అటెండ్​ అయినా, ఎజెండాపై చర్చించకుండా బయటకు వచ్చేశారు. దీంతో బయటకు వేర్వేరు కారణాలు కనిపిస్తున్నా, ఉద్యోగుల ట్రాన్స్​ ఫర్లు, మార్టిగేజ్​ రుణాల మంజూరు, ఇంక్రిమెంట్ల పంపిణీ అంశాలను సాకుగా చూపిస్తున్నా అంతిమంగా ఇన్​చార్జి చైర్మన్ ను తప్పించే అంశం మీద డైరెక్టర్లు పట్టుదలగా ఉన్నారు. 

​ ఏటా రూ.3వేల కోట్ల లావాదేవీలు..

ఏటా రూ.3వేల కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్న ఖమ్మం డీసీసీబీ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్​ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. బ్యాంక్​ పరిధిలో 100 పీఏసీఎస్​లు, 176 వ్యవసాయేతర సహకార సంఘాలు, 50 డీసీసీబీ బ్రాంచ్​ లు ఉన్నాయి. మొత్తం 21 మంది డైరెక్టర్లు ఉండాల్సి ఉండగా, నాలుగు ఖాళీ అయ్యాయి. 2019లో ఎన్నికలు జరగ్గా, ప్రస్తుత పాలకవర్గానికి ఇంకో నాలుగు నెలల సమయముంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్​ కు చెందిన కూరాకుల నాగభూషణం డీసీసీబీ చైర్మన్​ గా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు.

 కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ప్రాతినిధ్యం పీఏసీఎస్​ లో అవిశ్వాసం పెట్టి, నాగభూషణాన్ని పదవి నుంచి తప్పించడంతో ఆయన పదవి కోల్పోయాడు. అప్పటి వరకు డీసీసీబీ వైస్​ చైర్మన్​ గా ఉన్న దొండపాటి వెంకటేశ్వరరావు బ్యాంకు నిబంధనల ప్రకారం ఇన్​చార్జి చైర్మన్​ గా నియమితులయ్యారు. అప్పటి వరకు చైర్మన్​ సీటుపై ఆశలు పెట్టుకున్న ఇతర డైరెక్టర్లు తుళ్లూరు బ్రహ్మయ్య, యలగొందుల స్వామి, రావూరి సైదాబాబుతో పాటు మరికొందరు డైరెక్టర్లు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల ద్వారా ప్రయత్నాలు చేసుకున్నారు. 

ఈ సమయంలో ఇన్​చార్జి చైర్మన్​ దొండపాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్​ లో చేరడంతో వీరి ఆశలకు గండిపడింది. దీంతో 14 మంది డైరెక్టర్లు ఇన్​చార్జి చైర్మన్​కు వ్యతిరేకంగా కొత్త చైర్మన్​ ఎన్నిక నిర్వహించాలని నోటీసులు ఇచ్చారు. వెంటనే సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేసి డీసీసీబీలో ఖాళీగా ఉన్న నలుగురు డైరెక్టర్ల పదవులకు ఎన్నికల ద్వారా భర్తీ చేయాలని, ఇతర డిమాండ్లను ఎజెండాలో చేర్చాలని కోరారు. మార్చి 15న, జూన్​ 6, జూన్​ 13న సర్వసభ్య సమావేశాలను నిర్వహించారు. 16మంది డైరెక్టర్లలో 10 మంది సమావేశ ప్రాంగణానికి వచ్చినా కొత్త చైర్మన్​ ఎన్నికతో పాటు తాము చెప్పిన అంశాలు ఎజెండాలో లేవంటూ సమావేశాన్ని బహిష్కరించారు. అటు ఇన్​చార్జి చైర్మన్, ఇటు డైరెక్టర్లు పంతం వీడకపోవడంతో ఇప్పటికే మూడుసార్లు సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. 

సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో... 

ఒకవైపు వచ్చి వెళ్తున్న వర్షాలు, మరోవైపు విత్తనాలు, ఎరువులు, ఇంకోవైపు బ్యాంకు రుణాలు, పాత రుణాల మాఫీ.. ఇలా రకరకాల సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతూ సొసైటీల చుట్టూ తిరుగుతుంటే, వాటిని పరిష్కరించాల్సిన డీసీసీబీ పాలకవర్గ సభ్యులు మాత్రం కుర్చీల కుమ్ములాటలో బిజీగా ఉన్నారు. ఇన్​చార్జి చైర్మన్​ కు ఒక మంత్రి సపోర్ట్ ఉందని కొందరు చెబుతుంటే, మిగిలిన డైరెక్టర్లకు ఇంకో మంత్రి మద్దతు ఉందని మరికొందరు చెబుతున్నారు.

 దీంతో ఎవరికి వారు మెట్టదిగడంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సహకార శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నా, ఇంకో నాలుగు నెలల్లో ముగిసిపోయే పాలకవర్గానికి మార్పులు చేర్పులు ఎందుకనే ధోరణిలో ఆయన ఉన్నారని, అందుకే సైలెంట్ గా ఉంటున్నారని అనుచరులు చెబుతున్నారు.