బ్యాంకులు అప్పులివ్వట్లేదు.. కన్జూమర్లు ఎగబడట్లేదు

బ్యాంకులు అప్పులివ్వట్లేదు.. కన్జూమర్లు ఎగబడట్లేదు
  • అప్పులివ్వని బ్యాంకులే ఎకానమీ రికవరీకి అడ్డమా?
  • బ్యాంకులు కొత్తగా అప్పులివ్వడంలేదు 
  • కన్జూమర్లు అప్పులకు ఎగబడటం లేదు
  • ఇలా అయితే రికవరీ లేటే...అంటున్న ఎనలిస్టులు

వెలుగు బిజినెస్ డెస్క్​: చిన్న, పెద్ద వ్యాపారాలు పుంజుకునేందుకు అవసరమైన డబ్బును అప్పుగా ఇవ్వడానికి దేశంలోని బ్యాంకులు ముందుకు రావడం లేదు. అంతేకాదు, వ్యక్తులకు కూడా అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధపడటం లేదు. ఫలితంగా వేగంగా రికవరీ సాధించడం కష్టమవుతుందని ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. కరోనా రెండు వేవ్​ల దెబ్బకి దేశంలోని చిన్న, పెద్ద వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. దీంతో ఎకానమీకి గట్టి దెబ్బే తగిలింది. ఇప్పుడు మళ్లీ ప్రగతి​ బాటలోకి మళ్లాలంటే బ్యాంకుల నుంచి అప్పులు తప్పనిసరి. లిక్విడిటీ మెరుగుపడితేనే వినియోగం ఊపందుకుని, ఎకానమీ జోరందుకుంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు.

గత కొన్ని నెలలుగా కంపెనీలు, వ్యక్తులకు బ్యాంకులు ఇచ్చే అప్పులు 5.5 నుంచి 6 శాతం మాత్రమే పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారికి ముందుతో పోలిస్తే ఇవి సగం కూడా ఉండటం లేదు. దేశంలోని అతి పెద్ద బ్యాంకుగా పేరొందిన స్టేట్​ బ్యాంకు ఏప్రిల్​ నుంచి మొదలైన ఫైనాన్షియల్​ ఇయర్లో తాను ఇచ్చే అప్పులలో 10 శాతం గ్రోత్​ను టార్గెట్​గా పెట్టుకుంది. కానీ, ఈ టార్గెట్​ను అందుకోవడం కష్టమేనంటున్నారు. ఇప్పుడున్న సిట్యుయేషన్​ చాలా సున్నితమైనదని ఎస్​బీఐ చైర్మన్​ దినేష్​ ఖారా  ఇటీవల పేర్కొన్నారు. అప్పులు ఇచ్చే టార్గెట్లను అందుకోవడానికి అసెట్​ క్వాలిటీ విషయంలో రాజీ పడలేమని ఆయన స్పష్టం చేశారు.

అప్పుల టార్గెట్లు తగ్గించేస్తున్నయ్‌..
ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో 9.5 శాతం ఎకనమిక్​ గ్రోత్​ను ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకుంది. ఈ గ్రోత్​ రావాలంటే బ్యాంకుల నుంచి అప్పులు పెరగడం తప్పనిసరి. కాకపోతే, ఈ రెండూ సాధించడానికి అడ్డంకులేమిటనేది దినేష్​ ఖారా మాటల్లోనే తెలిసిపోతోంది. అంతకు ముందు ఆర్​బీఐ ఎకానమీ గ్రోత్​ 10.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కొత్త అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడకపోవడం వల్ల ఎకానమీ రికవరీ మరింత లేట్​ అవచ్చని ఆర్​బీఐ సహా చాలా మంది ఎనలిస్టులు చెబుతున్నారు. ఇచ్చిన అప్పులలో మొండి బాకీలు పెరుగుతుండటంతో బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వడానికి జంకుతున్నాయి. ఎకానమీ గ్రోత్​కి అప్పులనేవి చాలా ముఖ్యమని ఆర్​బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్​ ఎస్​ ఎస్​ ముంద్రా చెప్పారు. అప్పుల ప్రభావం నామినల్​ జీడీపీ గ్రోత్​పై ఉంటుందని, ఇది 1.6 రెట్ల దాకా ఉంటుందని అన్నారు.

అప్పులివ్వడం రూ. 1.7 లక్షల కోట్లు తగ్గింది..
మన దేశం ఇప్పటికే బ్యాంకుల మొండి బాకీల విషయంలో ఇబ్బందులలో ఉంది. మరోవైపు షాడో బ్యాంకింగ్​గా పిలిచే ఎన్​బీఎఫ్​సీ రంగంలోనూ గట్టి కుదుపులే గత కొన్నేళ్లలో వచ్చాయి. ఆయా రంగాలలోని రెండు పెద్ద సంస్థలను కాపాడాల్సి వచ్చింది. మరో రెండు దివాలా తీశాయి. ఇంకోవైపు, కార్పొరేట్లు కూడా కొత్త పెట్టుబడులకు సిద్ధపడటం లేదని సెంటర్​ ఫర్​ మానిటరింగ్​ ఇండియన్​ ఎకానమీ (సీఎంఐఈ) చెబుతోంది. క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ తగ్గిపోతోందని పేర్కొంటోంది. ఖర్చులు తక్కువవడం వల్లే కార్పొరేట్ల ప్రాఫిట్స్​ భారీగా పెరిగాయని, చేతిలో మిగిలిన డబ్బును బ్యాంకు లోన్లను తీర్చేందుకు కార్పొరేట్లు వాడాయని వివరిస్తోంది. దేశంలోని 15 టాప్​ సెక్టార్లలోని 1000 లిస్టెడ్​ కంపెనీలు ఏకంగా రూ. 1.70 లక్షల కోట్ల అప్పులను తగ్గించుకున్నట్లు ఎస్​బీఐ రీసెర్చ్​ డేటా చెబుతోంది. రిఫైనరీలు, స్టీల్​, ఫెర్టిలైజర్లు, మైనింగ్​, మినరల్​ ప్రొడక్ట్స్, టెక్స్​టైల్స్​ రంగాలలోని కంపెనీలే తమ అప్పులను రూ. 1.50 లక్షల కోట్ల మేర తగ్గించుకున్నాయి. ఇదే ట్రెండ్​ ఈ ఫైనాన్షియల్​ ఇయర్లోనూ కొనసాగుతుందని ఎస్​బీఐ చీఫ్​ ఎకానమిస్ట్​ సౌమ్య కాంతి ఘోష్​ ఇటీవల తన రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు కరోనా వలన ఎక్కువగా నష్టపోయిన టూరిజం, ఏవియేషన్‌, రెస్టారెంట్ సెక్టార్లలోని కంపెనీలకు అప్పులివ్వడానికి ఫైనాన్షియల్ సంస్థలు భయపడుతున్నాయి. ఈ సెక్టార్లలో అప్పులు మొండిబాకీలుగా మారే అవకాశం ఎక్కువని అంచనావేస్తున్నాయి. 

రిటెయిల్ లోన్లు పెరగడం కష్టమే!
క్రెడిట్​ డిమాండ్​ పెరగాలంటే ప్రైవేటు (క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​) పెట్టుబడుల సైకిల్లో పెద్ద మార్పులే రావాల్సి ఉంటుందని నిర్మల్​ బంగ్​ ఈక్విటీస్​ ఎకానమిస్ట్​ తెరెసా జాన్​ తెలిపారు. ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో జీడీపీ గ్రోత్​ 7 శాతంగా ఉండొచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. అయితే, బ్లూమ్​బర్గ్​ సర్వేలో ఎక్కువ మంది ఎనలిస్టులు  జీడీపీ గ్రోత్​ 9.2 శాతంగా ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కన్జూమర్లు కూడా తమ ఫైనాన్సెస్​కు రిపెయిర్లు చేసుకుంటున్నారని, దీంతో రిటెయిల్​ లోన్స్​ డిమాండ్ పుంజుకోవడం కష్టమేనని, దీని ఎఫెక్ట్​ ఎకనమిక్​ గ్రోత్​పై పడుతుందని ఎస్​ అండ్​ పీ గ్లోబల్​ రేటింగ్స్​ తన రిపోర్టులో తెలిపింది. కన్జూమర్లు పెద్దగా ఖర్చు పెట్టేందుకు ఇష్టపడటం లేదని ఈ రిపోర్టులో పేర్కొంది. ఎకానమీకి ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశమేనని వివరించింది.​ ​