డిపాజిట్ల కోసం బ్యాంకుల తహతహ..

డిపాజిట్ల కోసం బ్యాంకుల తహతహ..

న్యూఢిల్లీ: డిపాజిట్ల సమీకరణ కోసం దేశంలోని బ్యాంకులు కస్టమర్ల వెనకపడుతున్నాయి. ఎకానమీ జోరందుకోవడంతో కార్పొరేట్లు, బిజినెస్​లు, రిటెయిల్ అప్పులు తీసుకునే కస్టమర్లు ఎక్కువవుతున్నారు. ఈ నేపథ్యంలో తగిన నిధులను డిపాజిట్ల రూపంలో రాబట్టేందుకు బ్యాంకులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా క్రెడిట్ గ్రోత్​ రికార్డవుతోంది. ఈ ఏడాది అక్టోబర్​ నాటికి దేశంలో క్రెడిట్​ గ్రోత్​ 17.95 శాతానికి చేరింది. అంతకు ముందు ఏడాది ఈ గ్రోత్​ 9.7 శాతమేనని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా  (ఆర్​బీఐ) డేటా వెల్లడిస్తోంది. ఇదే టైములో డిపాజిట్లలో గ్రోత్​తగినంతగా రాలేదు. డిపాజిట్ల గ్రోత్ ​ఇంకా అయిదేళ్ల సగటు దగ్గరే నిలిచింది.  దీంతో ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని విధంగా డిపాజిటర్లను ఆకట్టుకునేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించే మార్గాల కోసం వెతుకుతున్నాయి.

షేర్లు, డెట్​ఫండ్స్​ నుంచి పోటీ....
బ్యాంకు డిపాజిట్ల కంటే మెరుగైన రాబడి, షేర్లు–డెట్​ ఫండ్స్​ ఇస్తుండటంతో బ్యాంకులకు కష్టాలు పెరుగుతున్నాయి. ఇన్​ఫ్లేషన్​ అయిదు నెలల గరిష్టానికి (7.4 శాతం) చేరడంతో డిపాజిట్లపై ప్రజలకు వస్తున్న వార్షిక రాబడి 6 శాతానికి మించలేదు. అంటే బ్యాంకు డిపాజిట్లు  నెగెటివ్​ రిటర్న్స్​ ఇస్తున్నాయన్నమాట. కరోనా టైములో సమీకరించిన డిపాజిట్ల లిక్విడిటీతోనే బ్యాంకులు ఇప్పటిదాకా నెట్టుకొస్తున్నాయని క్రిసిల్​ డిప్యూటీ చీఫ్​ రేటింగ్స్​ ఆఫీసర్​  క్రిష్ణన్​ సీతారామన్ చెప్పారు. డిపాజిట్ల సేకరణకు బ్యాంకులు ఇప్పుడు ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిందేనని పేర్కొన్నారు. కెనరా బ్యాంకు ఉద్యోగి ఒకరు ఇటీవల ముంబైలో మెగాఫోన్​ పట్టుకుని మరీ తమ బ్యాంకు డిపాజిట్ల వివరాలను వెల్లడిస్తున్న వీడియో ట్విటర్​లో తాజాగా వైరలయింది. అయితే, తమ బ్యాంకు ఉద్యోగులు ఎంత మంది ఇలాంటి స్ట్రాటజీలకు పాల్పడుతున్నారో చెప్పడానికి కెనరా బ్యాంకు నిరాకరించింది. పెద్ద పెద్ద షాపుల దగ్గరకు వచ్చే కస్టమర్ల నుంచి డిపాజిట్లు సేకరించేందుకు యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగులు కూడా  అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.