న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నికల్ కంపెనీల డెవెలప్‌మెంట్ కోసం ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ విప్లవాత్మకమైన మార్పులను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల్లో పీర్ టూ పీర్(పీ2పీ) సిస్టమ్‌లో కీలక సవరణలు చేపట్టి లెండింగ్ కోసం మార్కెట్ ప్లేస్ మోడల్‌ను అభివృద్ధి చేయడం, బ్రాంచులను ఏర్పాటు చేయకుండానే బ్యాంక్‌లు వర్చువల్ బ్యాంకింగ్ సేవలను అందించడం, ఫీల్డ్ అసెస్‌మెంట్ల కోసం డ్రోన్లను ఉపయోగించడం, మోసాలను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగించడం వంటి వాటిని హై లెవల్ కమిటీ ప్రతిపాదించింది. కమిటీ సమర్పించిన ఈ రిపోర్ట్‌లో.. డేటా భద్రత, గోప్యత అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఫైనాన్సియల్ సెక్టార్‌లో ఉన్న రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా సమీక్షించింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌ను డీమెటీరయలైజ్డ్ ఫార్మాట్లోకి మార్చాలని ప్రతిపాదించింది. ల్యాండ్ రికార్డులను కూడా డిజిటల్‌గా మార్చాలని పేర్కొంది. దేశంలో పెరుగుతున్న ఫిన్‌టెక్, డిజిటల్ సర్వీసులను దృష్టిలో పెట్టుకున్న కమిటీ వినియోగదారుల భద్రత కోసం సమగ్రమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ఉండాలని సూచించింది.
ఫిన్‌టెక్‌లది కీలక పాత్ర…
ఫైనాన్స్‌ను అందించడంలో ఫిన్‌టెక్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందించిన రిపోర్ట్‌లో కమిటీ పేర్కొంది. ఈ కమిటీని అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 2018–19 బడ్జెట్ స్పీచ్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్యానెల్‌కు హెడ్‌గా ఆర్థిక వ్యవహారాల విభాగం సెక్రటరీ ఉన్నారు. ఆర్‌బీఐ, సెబీతో పాటు మరికొన్ని డిపార్ట్‌మెంట్లకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వినియోగదారుల ప్రయోజనాల, భద్రత మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. నాన్ బ్యాంక్‌లకు పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందించే విషయంలో ఎలాంటి వివక్ష చూపించకూడదని కమిటీ ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి సూచించింది. డిజిటల్ పేమెంట్లు విస్తరించేందుకు బ్యాంక్‌ల, నాన్ బ్యాంక్‌ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని, ఇన్నోవేషన్‌ను సృష్టించాలని పేర్కొంది.
వర్చువల్ బ్యాంకింగ్ విషయంలో ఆర్‌బీఐ, ఫైనాన్సియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ లు పరిశోధన జరపాలని చెప్పింది. దాని ఖర్చులు, ప్రయోజనాలు ఏ మేరకు ఉంటాయో కనుగొనాలని పేర్కొంది. బ్యాంక్‌లు బ్రాంచ్‌లు ఏర్పాటు చేయకుండానే కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమవ్వాలని కూడా తెలిపింది. వారి యాప్స్ ద్వారానే సేవింగ్స్ అకౌంట్లను ఆపరేట్ చేయడం, కార్డులను జారీ చేయడం, పేమెంట్ సర్వీసులను ఆఫర్ చేయడం చేయాలని తెలిపింది. పంటల బీమాకు డ్రోన్లను వాడే పద్ధతిని కూడా సూచించింది. దీంతో సరియైన, కచ్చితమైన అసెస్‌మెంట్స్ చేయొచ్చని చెప్పింది.

