ఓవర్‌‌‌‌డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తున్న బ్యాంకులు

 ఓవర్‌‌‌‌డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తున్న బ్యాంకులు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చాలా భారతీయ బ్యాంకులు ఖాతాదారులకు ఓవర్‌‌‌‌డ్రాఫ్ట్ (ఓడీ) సదుపాయాన్ని అందజేస్తున్నాయి. అంటే మన ఖాతాలో డబ్బేమీ లేకపోయినా కొంతమొత్తాన్ని అప్పుగా తీసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి.  అత్యవసర సమయాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు. ఓవర్‌‌డ్రాఫ్ట్ సదుపాయం షార్ట్​ టర్మ్​ లోన్​ మాదిరిగా ఉంటుంది. బ్యాంకు కస్టమర్‌‌లు తమ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోడానికి చిన్న మొత్తంలో రుణాన్ని తీసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) తో పాటు  దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ లెండర్లలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి ఓవర్‌‌డ్రాఫ్ట్ సౌకర్యాలను పొందవచ్చు. అర్హులైన బ్యాంకు ఖాతాదారులు అవసరమైన సమయాల్లో నెలవారీ వేతనానికి మూడు రెట్ల మొత్తాన్ని అడ్వాన్స్‌‌గా పొందవచ్చు. అయితే, ఓడీ పరిమితులు ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా ఉంటాయి.  కస్టమర్ ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా లిమిట్స్​ ఆధారపడి ఉంటాయి.  మీరు జీతం తీసుకునే వాళ్లు అయితే ఓవర్‌‌డ్రాఫ్ట్ సదుపాయానికి సంబంధించి మీకు బ్యాంకులు సమాచారం ఇస్తాయి. ఓడీ పరిమితి గురించి బ్యాంకులు సాధారణంగా వినియోగదారులకు ముందుగానే తెలియజేస్తాయి. మరో విషయం ఏమిటంటే జీతం పొందే వారందరూ ఓవర్​డ్రాఫ్ట్​ సదుపాయానికి అర్హులు కారు. కొన్ని బ్యాంకులు ఉద్యోగి  నెలవారీ వేతనంలో కొంత భాగాన్ని మాత్రమే అప్పుగా ఇస్తాయి. ఓడీ  నిబంధనలు,  షరతులు కొంచెం క్లిష్టంగా ఉంటాయి.  సంబంధిత బ్యాంకులో శాలరీ అకౌంట్​ ఉన్నవారు మాత్రమే ఓడీకి అర్హులు.  

క్రెడిట్​ స్కోరు బాగుండాలి..

బ్యాంకులు వారి ఖాతాలకు అడ్వాన్స్‌‌‌‌ను బదిలీ చేయడానికి ముందే వారి క్రెడిట్ రేటింగ్‌‌లను (సిబిల్​ వంటివి) తనిఖీ చేస్తాయి.  క్రెడిట్​స్కోర్​ బాగున్న వారు ఓడీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓవర్‌‌డ్రాఫ్ట్ సౌకర్యం తీసుకునే అడ్వాన్స్‌‌లపై బ్యాంకులు భారీగా వడ్డీని  వసూలు చేస్తాయి.  ఇవి దాదాపు నెలకు 1‌‌‌‌–3 శాతం వరకు ఉంటాయి. సంవత్సరానికి అయితే 12–30 శాతం వరకు ఉంటాయి. వీటికి ప్రాసెసింగ్​ ఫీజు అదనం. సంవత్సరం తరువాత కూడా ఓడీని కొనసాగించదల్చుకుంటే యాన్యువల్​ రెన్యువల్​ ఫీజు ఉంటుంది. వడ్డీరేట్లు దాదాపు క్రెడిట్​కార్డుల మాదిరిగానే ఉంటాయని బ్యాంక్​ బజార్​ డాట్​కామ్​కు చెందిన పర్సనల్​ఫైనాన్స్​ ఎక్స్​పర్టు ఒకరు అన్నారు. కొన్ని బ్యాంకులు అకౌంట్​ను బట్టి రూ.3–5 లక్షల వరకు ఓడీ ఇస్తే, మరికొన్ని రూ.1.5 లక్షల వరకు ఇస్తాయి. కేవలం రూ.25 వేల వరకు మాత్రమే ఇచ్చే బ్యాంకులూ ఉన్నాయి. హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంకులు శాలరీకి ఐదు రెట్ల వరకు ఓడీ ఇస్తాయి. ఇవి రూ.ఐదు లక్షల వరకు చెల్లిస్తాయి. అకౌంట్​ హోల్డర్లు తమ వీలును బట్టి అప్పును కిస్తీలుగా లేక ఒకేసారి చెల్లించవచ్చు.