నిజామాబాద్ కాంగ్రెస్​లో ఐక్యరాగం

నిజామాబాద్ కాంగ్రెస్​లో ఐక్యరాగం
  • అలకలు, అసంతృప్తి వీడిన నేతలు
  • గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారాలు
  • గవర్నమెంట్​ వస్తే పదవులు వస్తాయని ఆశ

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్​ పార్టీ లీడర్లు పనిచేస్తున్నారు. ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ లీడర్లు కొన్ని రోజులు అలకబూనినా.. పార్టీ అధికారంలోకి వస్తే తమకు భవిష్యత్​ ఉంటుందని భావించి క్యాండిడేట్లకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒకరిద్దరు తప్పితే లీడర్లంతా అభ్యర్థుల విజయానికి ఉమ్మడి కృషి చేస్తూ ఐక్యరాగం ఆలపిస్తున్నారు.

పార్టీ గెలుపే ముఖ్యం..

అర్బన్​ సెగ్మెంట్ ​నుంచి బరిలో నిలిచి తమ సత్తా చాటాలని ముఖ్యమైన లీడర్లు భావించారు. మైనార్టీ నేత తాహెర్, మాజీ మేయర్​ధర్మపురి సంజయ్, టీపీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ కేశవేణు తదితరులు టికెట్​ఆశించారు. ఇటీవల బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ ఆకుల లలిత సైతం టికెట్ కోసం ప్రయత్నించారు. ఇక్కడ మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో పార్టీ అనూహ్యంగా మాజీ మంత్రి, మైనార్టీ నేత షబ్బీర్​అలీకి టికెట్​ కేటాయించింది. 

దీంతో నారాజ్​కు లోనైన స్థానిక నేతలు త్వరగానే కోలుకొని షబ్బీర్​ విజయం కోసం కృషి చేస్తున్నారు. తాహెర్, లలిత, సంజయ్, కేశవేణు​తదితరులు షబ్బీర్​తో కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. రూరల్​ టికెట్​ఆశించి సాధ్యం కానందున మొదట్లో అలక వహించిన మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్​నగేశ్​రెడ్డి, అభ్యర్థి డాక్టర్ ​భూపతిరెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పరోక్షంగా అండగా నిలుస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో పోటీ ప్లాన్​తో సరంజామా సిద్ధం చేసుకున్న డీసీసీ ప్రెసిడెంట్​మానాల మోహన్​రెడ్డి, కిసాన్ సంఘం స్టేట్ ​ప్రెసిడెంట్​ అన్వేశ్​రెడ్డి ఇప్పుడు పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్​రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. 

నో రెబల్స్​..

ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు దక్కని నేతలు రేబల్​గా బరిలో నిలిచి పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు దెబ్బతీస్తారని అంతా భావించారు. కానీ వారు అనూహ్యంగా తమ నామినేషన్లు విత్​డ్రా చేసుకొని, పార్టీ క్యాండిడేట్ల విజయం కోసం కృషి చేస్తున్నారు. ఆర్మూర్​ టికెట్​ఆశించి భంగపడ్డ సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్​ నామినేషన్​ దాఖలు చేశారు. ఓట్లు చీలి పార్టీకే నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నామినేషన్​ విత్​ డ్రా చేసుకొని, వినయ్​రెడ్డి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. 

బాన్సువాడ టికెట్​దక్కకపోవడంతో సూసైడ్​అటెంప్ట్​ చేసిన కాసుల బాల్​రాజ్, ట్రీట్​మెంట్​తర్వాత కొలుకొని అభ్యర్థి ఏనుగు రవీందర్​రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. మూడుసార్లు జుక్కల్​ ఎమ్మెల్యేగా గెలిచిన గంగారాంకు ఈ సారి పార్టీ టికెట్​ దక్కలేదు. దీంతో అతడు ఇండిపెండెంట్​గా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. కార్యకర్తల సూచన మేరకు నామినేషన్​విత్​డ్రా చేసుకొని పార్టీ గెలుపు కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఎల్లారెడ్డిలో టికెట్ రాక ఆగ్రహంతో పార్టీ వీడిన సుభాష్​రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. కానీ ఆయన క్యాడర్ లో చాలా మంది కాంగ్రెస్​లోనే కొనసాగుతూ మదన్​మోహన్​ కోసం పని చేస్తున్నారు.