ఉద్రిక్తత మధ్య దీపిక పోస్టుమార్టం.. న్యాయం చేస్తామని హామీ

ఉద్రిక్తత మధ్య దీపిక పోస్టుమార్టం.. న్యాయం చేస్తామని హామీ

నిర్మల్, వెలుగు :  బాసర  ట్రిపుల్ ఐటీలో  ఆత్మహత్యకు పాల్పడ్డ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ దీపిక పోస్టుమార్టం బుధవారం ఉదయం ఉద్రిక్తత మధ్య ముగిసింది. దీపిక తండ్రి వీరయ్యకు మంగళవారం రాత్రి నిర్మల్ జిల్లా దవాఖానలో ఛాతి నొప్పి రాగా, ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. పోలీసులు దీపికకు పోస్టుమార్టం చేయాలని ఒత్తిడి తేగా మరణంపై తమకు అనుమానాలున్నాయని కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ట్రిపుల్ ఐటీకి చెందిన ఓ ఆఫీసర్ ​వచ్చి ఎంత చెప్పినా వినలేదు.

 మృతిపై నిజనిర్ధారణ జరిపిన తర్వాతే పోస్టుమార్టం చేయాలని పట్టుపట్టారు. దీంతో రాత్రంతా దవాఖానలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మ రాజు, రాజేశ్వర్ రెడ్డి, ఏబీవీపీ నాయకులు వెంకటేశ్, శివకుమార్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాగర్, బీఎస్పీ  జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్, ఇతర నాయకులు రాత్రంతా హాస్పిటల్​లోనే ఉండి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. తెల్లారిన తర్వాత పోలీసులతో పాటు ట్రిపుల్ ఐటీ ఆఫీసర్..​దీపిక తండ్రి వీరయ్యకు ఎలాగో నచ్చజెప్పారు. ఘటనపై  విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆయన పోస్ట్​మార్టం చేయడానికి ఒప్పుకున్నారు.

 అయితే, మృతిపై ఎలాంటి విచారణ చేపట్టకుండా పోస్టుమార్టం చేయడం కరెక్ట్​ కాదంటూ బీజేపీ, బీజేవైఎం, బీఎస్పీ లీడర్లు, కార్యకర్తలు దవాఖాన గేటు ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పీఎస్​కు తరలించారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా మెయిన్​గేటు దగ్గర బలగాలను మోహరించారు. బందో బస్తు మధ్య దీపిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అంబులెన్స్ లో సొంత గ్రామానికి తరలించారు.