నిరసన కొనసాగిస్తున్నస్టూడెంట్లు

నిరసన కొనసాగిస్తున్నస్టూడెంట్లు
  • క్లాసులకు వెళ్లేవాళ్లను అడ్డుకుంటే షోకాజ్ ఇస్తామని అధికారుల హెచ్చరిక
  • క్యాంపస్ కు వెళ్తుండగా సోయం బాపూరావును అరెస్టు చేసిన పోలీసులు
  • ఫుడ్ కాంట్రాక్టర్లు ఎమ్మెల్సీ కవిత సన్నిహితులేనని ఎంపీ ఆరోపణ

భైంసా/బాసర/లోకేశ్వరం, వెలుగు: సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. శనివారం రాత్రి అన్నం తినకుండా నిరసన తెలిపిన విద్యార్థులు.. ఆదివారం ఉదయం టిఫిన్ కూడా చేయలేదు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. చివరకు సెలవుల్లో ఉన్న సీనియర్లు ఫోన్ చేసి జూనియర్లతో మాట్లాడగా భోజనాలు చేశారు. అనంతరం తిరిగి ఆందోళన కొనసాగించారు. ఇంజనీరింగ్ థర్డ్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ల సెలవులు ఆదివారంతో ముగియగా, వాళ్లు సోమవారం క్యాంపస్ కు రానున్నారు. దీంతో ఆందోళనలు ఉధృతమయ్యే అవకాశం ఉందని అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఇంతకుముందు జరిగిన ఆందోళనల్లో సీనియర్లే యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు వాళ్లు సెలవులపై ఇండ్లకు వెళ్లడంతో ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్లు నిరసన తెలుపుతున్నారు. ఇక సీనియర్లు కూడా జత కలిస్తే పరిస్థితి మరింత సీరియస్ అవుతుంది. కాగా, క్లాసులకు వెళ్లే స్టూడెంట్లను ఆందోళన చేసేవాళ్లు అడ్డుకుంటే షోకాజ్ నోటీసులు ఇస్తామని అధికారులు చెప్పారు. నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోకపోతే క్యాంపస్ నుంచి వెళ్లగొడ్తామని హెచ్చరించారు. శనివారం రాత్రి విద్యార్థులతో ఇన్ చార్జ్ వీసీ వెంకటరమణ జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆఫీసర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

క్లాసులకు రండి: ఇన్ చార్జ్ వీసీ  

సర్కార్ ఇచ్చిన హామీ మేరకు క్యాంపస్ లోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఇన్ చార్జ్ వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు ఇచ్చే 3 వేల ల్యాప్​ట్యాప్ ల కోసం రూ.9 కోట్లు అవసరమవుతాయని.. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని, నిధులు రాగానే అందజేస్తామన్నారు. మెస్​ల కాంట్రాక్టు మార్చేందుకు కొత్తగా టెండర్లు పిలిచామని, ఇందుకు నోటిఫికేషన్​కూడా జారీ చేశామని తెలిపారు. మిగిలిన సమస్యలనూ పరిష్కరిస్తామని, విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని సూచించారు. ‘‘కొన్ని ప్రాంతాల్లోనే సెల్​ఫోన్ల వినియోగంపై నిషేధం విధించాం. కఠిన ఆంక్షలు అమలు చేయడం లేదు. విద్యార్థులను ఎవరైనా రెచ్చగొట్టేట్టు ప్రవర్తిస్తే  షోకాజ్ నోటీసులు ఇస్తాం. హద్దులు దాటితే క్యాంపస్ నుంచి కూడా తొలగిస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం” అని చెప్పారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఇన్సూరెన్స్​డబ్బులు వర్సిటీ అకౌంట్లో భద్రంగానే ఉన్నాయని, త్వరలోనే ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించి అందరికీ హెల్త్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

కవిత సన్నిహితులే ఫుడ్ కాంట్రాక్టర్లు: బాపూరావు 

స్టూడెంట్లను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ సోయం బాపూరావును నిర్మల్ ​జిల్లా మన్మథ్​ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేవైఎం నేత కుమ్మరి వెంకటేశ్​ కింద పడగా, అతని కాళ్లపై నుంచే పోలీసులు వాహనాన్ని పోనిచ్చారు. దీంతో ఆయన గాయపడగా, ఆస్పత్రికి తరలించారు. పోలీసుల తీరుపై బాపూరావు మండిపడ్డారు. పోలీసులు ఆదిలాబాద్ తరలించిన తర్వాత తన ఇంట్లో మాట్లాడారు. ఎంపీగా విద్యార్థుల సమస్యలు తెలుసుకునే హక్కు తనకు లేదా? అని ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లా మని చెప్పారు. క్యాంపస్​లో ఉన్న ముగ్గురు ఫుడ్ కాంట్రాక్టర్లలో ఇద్దరు ఎమ్మెల్సీ కవిత సన్నిహితులేనన్నారు. సమస్యల పరిష్కారంలో విఫలమైన విద్యాశాఖ మంత్రి సబిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

బాసర స్టూడెంట్ల ఆందోళనలపై సర్కార్‌‌‌‌‌‌‌‌కు నివేదిక

హైదరాబాద్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. దశలవారీగా క్యాంపస్‌‌‌‌లో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నా, ఇంకా నిరసనలు జరుగుతుండటంపై ఆర్జీయూకేటీ వర్సిటీ అధికారిక వర్గాల్లో చర్చ మొదలైంది. దీనిపై సమగ్ర నివేదికను సోమవారం లేదా మంగళవారం రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌కు ఆర్జీయూకేటీ ఇన్‌‌‌‌చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ అందించనున్నట్లు తెలిసింది. స్టూడెంట్ల ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకపోవడం, భోజనం, తాగు నీరు విషయంలో ఆందోళనలు, నిధుల దుర్వినియోగం, రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లో గందరగోళం, సిబ్బంది పనితీరుపై నివేదిక అందించనున్నట్టు సమాచారం.

బాసర స్టూడెంట్లకు విద్యార్థి సంఘాల మద్దతు

బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారం కోసం స్టూడెంట్లు చేస్తున్న ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌‌‌‌యూ, ఏఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌, ఏఐడీఎస్‌‌‌‌వో, ఏబీవీపీ తదితర సంఘాలు ఆదివారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు.