ముస్తాబైన బాసర..నేడే (సెప్టెంబర్ 29) మూలా నక్షత్రం వేడుకలు

ముస్తాబైన బాసర..నేడే (సెప్టెంబర్ 29) మూలా నక్షత్రం వేడుకలు
  • లక్ష మందికిపైగా హాజరుకానున్న భక్తులు
  • పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు
  • వీఐపీ దర్శనాలపై ఆంక్షలు 
  • పార్కింగ్ జోన్ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్

నిర్మల్, వెలుగు: అత్యంత పవిత్రంగా భావించే మూలా నక్షత్రం వేడుకలకు బాసర సరస్వతి దేవి ఆలయం ముస్తాబయ్యింది. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈనెల 29న మూలా నక్షత్రం వేడుకలు సరస్వతి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈసారి కూడా లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు చెబుతున్నారు.

ఆలయాన్ని రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించారు. ఇటీవల బాసర ఆలయ ఈవో గా బాధ్యతలు చేపట్టిన అంజనీదేవి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు. గతేడాది ఎదురైన కొన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన్నట్లు ఈవో వెల్లడించారు.

ఏడాదిలోనే ఎక్కవగా అక్షరాభ్యాసాలు 

మూలా నక్షత్రం రోజు తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు జరిపితే విద్యావంతులు, ప్రయోజకులు అవుతారని భక్తుల నమ్మకం. దీంతో నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా బాసరలో ఏటా నిర్వహించే మూలా నక్షత్రం వేడుకలకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అక్షరాభ్యా సాల కోసం తరలిరానున్నారు. దీంతో ఇప్పటికే ఇక్కడి గెస్ట్ హౌస్ లన్నీ రిజర్వ్ అయిపోయాయి. ప్రైవేట్ లాడ్జీల్లోనూ భారీగా బుకింగ్​లు జరిగాయి. 

క్యూలైన్​లో ఉండే భక్తులకు ఫ్రీగా పండ్లు, టీ, బిస్కెట్లు

ఏటా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈసారి కలెక్టర్ అభిలాష అభినవ్ సూచనలతో ఈఓ అంజనీ దేవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ఇదివరకే ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లపై ఈవోతో సమీక్షించారు. భారీగా భక్తులు హాజరు కానుండడంతో దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలైన్​లను ఏర్పాటు చేశారు. 

క్యూ లైన్​లో వేచిచూసే భక్తుల కోసం తాగునీరు, పండ్లు, టీ, బిస్కెట్లు ఉచితంగా అందించేందుకు నిర్ణయించారు. తరలివచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. నిజామాబాద్, నాందేడ్, నిర్మల్ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం వేర్వేరు పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు.