భక్తులతో కిటకిటలాడుతున్న బాసర క్షేత్రం

భక్తులతో కిటకిటలాడుతున్న బాసర క్షేత్రం

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ పుష్యమి నక్షత్రం, పూర్ణిమ, ఆదివారం సెలవు కావడంతో తెల్లవారు జామునుండే భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలని రాష్ట్ర నలుమూలల నుంచి తల్లిదండ్రులు వేలాదిగా తరలి వచ్చారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు, శ్రీకర, కుంకుమార్చన పూజలు జరిపించారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జనం తాకిడి ఎక్కువగా ఉండటంవల్ల అమ్మవారి దర్శనానికి ఆలస్యం అవుతోంది. భక్తుల రద్దీకి తగినట్లుగా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటుచేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.