బస్వాపురం ప్రాజెక్టు భూనిర్వాసితుల ఆందోళన

బస్వాపురం ప్రాజెక్టు భూనిర్వాసితుల ఆందోళన
  • ఇంకా పరిహారం అందలేదని ప్రాజెక్టు కట్టపై ధర్నా
  • ఓట్లు వేసినా.. ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని మండిపాటు
  • నచ్చజెప్పేందుకు అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో యత్నం

యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపురం ప్రాజెక్టు భూనిర్వాసితులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రాజెక్టు కట్టపైనే బైఠాయించి సాయంత్రం వరకు ధర్నా చేశారు. మూడేండ్లయినా పరిహారం అందలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. ఆఫీసర్లు వారి ఆందోళన విరమించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆఫీసర్లు వెనుదిరిగారు. కాగా, ఈ ప్రాజెక్టు సంబంధించి బీఎన్ తిమ్మాపురంలో ప్రభుత్వం 1176 ఎకరాల భూమి సేకరించగా.. పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వలేదు.

ఓట్లు వేస్తే మోసం చేసిండు..

గత ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి గంపగుత్తగా ఓట్లు వేశామని, అయినా తమను పట్టించుకోవడం లేదని బస్వాపురం నిర్వాసితులు ధ్వజమెత్తారు. ఓట్లు వేయించుకుని మోసం చేశాడని, ఎమ్మెల్యే డౌన్​డౌన్ అంటూ నినదించారు. ఏండ్లుగా ఆందోళన చేస్తున్నా ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదన్నారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్ సాయంత్రం ధర్నా ప్రాంతానికి చేరుకున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గతంలో కలెక్టర్ కూడా డబ్బులు ఇప్పిస్తానని చెప్పి, పట్టించుకోలేదన్నారు. ఈ నెలలో డబ్బులు వస్తాయని, రాగానే పంపిణీ చేస్తామని అడిషనల్ కలెక్టర్ వివరించారు. అయినా నిర్వాసితులు వినిపించుకోలేదు. చేసేది ఏమీ లేక వాళ్లు కూడా వెనుదిరిగారు.