సీఎం ఆస్తుల ప్రకటన..అప్పులెన్నో తెలుసా..

సీఎం ఆస్తుల ప్రకటన..అప్పులెన్నో తెలుసా..

కర్ణాటకలో ఎన్నికల ప్రచార జోరు..నామినేషన్ల హోరు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పార్టీల తరపున టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. తాజాగా కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై హవేరీ జిల్లాలోని షిగ్గావ్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు. ఇందులో  బసవరాజు బొమ్మై తన ఆస్తుల విలువను రూ. 49.70 కోట్లుగా పొందుపర్చడం విశేషం. 

ఏమేమీ ఉన్నాయంటే..

బసవరాజు  బొమ్మై వద్ద రూ.5.98 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం నుంచి రూ.1.57 కోట్ల సంపద దక్కినట్లు చెప్పారు. బసవరాజు భార్య చన్నమ్మ పేరిట రూ.1.14 కోట్లు ఉన్నాయని..అలాగే తన కూతురు అదితి పేరిట రూ.1.12 కోట్ల ఆస్తులున్నాయని చెప్పారు. కుమారుడు భరత్ బొమ్మై తన తండ్రిపై ఆధారపడనందున.... అతని ఆస్తుల వివరాలను బసవరాజు బొమ్మై పేర్కొనలేదు. అయితే తన కుమారుడికి రూ.14.74 లక్షలు ఇచ్చినట్లు అఫిడవిట్ లో  బసవరాజ్ బొమ్మై  ప్రస్తావించారు.

అప్పులు ఎన్నో తెలుసా..

ముఖ్యమంత్రి  బసవరాజ్ బొమ్మై కి రూ.42.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయట.  ఇందులో హిందూ అవిభాజ్య కుటుంబం నుంచి రూ.19.2 కోట్ల ఆస్తి వచ్చిందని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయనకు రూ.5.79 అప్పులు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత.... ధార్వాడ్‌లోని హుబ్బళ్లి తాలూకా తరిహాల గ్రామంలో 3ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. బసవరాజ్ బొమ్మై.. ఆయనపై ఆధారపడిన వారి ఆస్తుల విలువ మొత్తం రూ.52.12 కోట్లుగా పేర్కొన్నారు.