క్రికెట్ వద్దురా అయ్యా.. బేస్‌బాల్ ఎంచుకోండి.. పదేళ్ల కాంట్రాక్ట్‌కు రూ.5837 కోట్లు

క్రికెట్ వద్దురా అయ్యా.. బేస్‌బాల్ ఎంచుకోండి.. పదేళ్ల కాంట్రాక్ట్‌కు రూ.5837 కోట్లు

మన దేశ క్రీడా హాకీ అయినా అత్యధిక గుర్తింపు ఉన్నది మాత్రం.. క్రికెట్‌కే. దేశంలో ఏ మూల చూసినా బ్యాట్, బాల్ చేత పట్టిన కుర్రాళ్లే కనిపిస్తారు కానీ, హాకీ స్టిక్ తో కనిపించేవారు చాలా అరుదు. క్రికెటర్ కావాలని, దేశాలని ఆడాలని కలలు కనే వర్ధమాన క్రికెటర్లు లక్షల మంది ఉన్నారు. ఒక్కసారి దేశానికి ప్రాతినిథ్యం వహిస్తే పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు వస్తుండటమే అందుకు కారణం. గొప్ప క్రికెటర్ అయితే ఐపీఎల్ లాంటి లీగుల్లో కోట్లు కొల్లగొట్టొచ్చన్నది వారి తాపత్రయం. అలాంటి వారందరికి విస్మయాన్ని కలిగించే వార్త ఇది. 

గత సీజన్ లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆసీస్ ఆల్‪రౌండర్ కెమరూన్ గ్రీన్ కోసం రూ. 17 కోట్లు వెచ్చిస్తే అబ్బా అనుకున్నాం.. అదే, పంజాబ్ ప్రాంచైజీ ఇంగ్లాండ్ ఆల్‪రౌండర్ సామ్ కరన్ కోసం రూ. 18 కోట్లు వెచ్చిస్తే అంత డబ్బు ఏం చేసుకుంటారా అని చర్చించుకున్నాం. ఇలా రెండెంకెల కోట్ల సంపాదనకే ఆశ్చర్యపోతే.. ఒక బేస్‌బాల్ క్రీడాకారుడు పదేళ్ల కాలానికి ఏకంగా 5వేల కోట్లు ఆర్జించాడు అంటే ఇంకెంత ఆశ్చర్యపోవాలో ఆలోచించండి. జపాన్ బేస్‌బాల్ ప్లేయర్ షోహీ ఒహ్తానీ ప్రపంచ క్రీడా చరిత్రలోనే అత్యధిక మొత్తం డీల్ అందుకున్నాడు.


గతంలో ఆర్జెంటినా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోసం బార్సిలోనా జట్టు నాలుగేళ్లకుగాను 67.4 కోట్ల డాలర్ల(సుమారు రూ.5600 కోట్లు)కు ఒప్పందం కుదుర్చుకోగా.. ఒహ్తానీ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ బేస్‌బాల్ ప్లేయర్ కోసం లాస్ ఏంజిల్స్ డాడ్జర్స్ టీమ్ ఏకంగా 70 కోట్ల డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.5837 కోట్లు)కు పదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ క్రీడా చరిత్రలో ఇది అతి పెద్ద డీల్ అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఒక్క డీల్‌తో ఒహ్తానీ ప్రపంచంలో అత్యధిక మొత్తం సంపాదిస్తున్న అథ్లెట్ల జాబితాలో చేరిపోయాడు.

ఆరేళ్లుగా లాస్ ఏంజిల్స్ ఏంజిల్స్ జట్టుకు ఆడుతున్న ఒహ్తానీ కాంట్రాక్ట్ ఈ మధ్యే పూర్తయ్యింది. అప్పటినుంచి అతన్ని చేజిక్కించుకునేందుకు ప్రాంచైజీల మధ్య బిడ్డింగ్ వార్ నడుస్తుండగా.. చివరికు లాస్ ఏంజిల్స్ డాడ్జర్స్ టీమ్ అతన్ని భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అందువల్ల ఇకనైనా క్రికెట్ ఒక్కటే క్రీడ కాదని గుర్తించి హాకీ, ఫుట్ బాల్, బేస్‌బాల్ వంటి ఇతర క్రీడల వైపు ద్రుష్టి సారించండి.