అప్లికేషన్ల ఆధారంగా ఎవరికెన్ని భూములో తేల్చాలి

అప్లికేషన్ల ఆధారంగా ఎవరికెన్ని భూములో తేల్చాలి
  • ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి
  •  జీవో 140కి అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలి
  •  గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు, వెలుగు: ములుగు జిల్లాలో అర్హులైన రైతులకు పోడు పట్టాలు ఇచ్చేందుకు ఆఫీసర్లు సమన్వయంతో పని చేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 140 జీవోకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలన్నారు. మంగళవారం ములుగు కలెక్టరేట్ లో రెవెన్యూ, ఫారెస్ట్, పోలీసు శాఖల ఆఫీసర్లతో మంత్రి రివ్యూ నిర్వహించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా  91,843 ఎకరాలకు గాను 34,044 పోడు పట్టాల అప్లికేషన్లు వచ్చాయన్నారు.

ఇక్కడే ఎక్కువ సమస్య..

ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం లింగాల, బందాల గ్రామాల్లో పోడు సమస్య ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా టెక్నికల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి, సర్వే చేయాలన్నారు. భవిష్యత్తులో ఫారెస్ట్ భూములు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులందరికీ పోడు పట్టాలు అందజేయాలని కోరారు. మీటింగ్​లో జడ్పీ చైస్ చైర్మన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ.. గతంలో పట్టాలు జారీ చేసిన రైతులకు.. బోర్లు వేసుకునేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వాలన్నారు. పోడు భూముల్లో ట్రాక్టర్లు వెళ్లేందుకు కూడా అనుమతించాలన్నారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా మంత్రి సారథ్యంలో పోడు భూములపై జిల్లా స్థాయి కమిటీ వేశామని.. అందులో కలెక్టర్ కన్వీనరగ్ గా, ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, ఎస్పీ, డీఎఫ్వో, ఐటీడీఏ పీవో సభ్యులుగా ఉంటారన్నారు. పోడు భూముల సర్వేకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఐటీడీఏ పీవో అంకిత్, ఎస్పీ డా.సంగ్రాం సింగ్ జీ పాటిల్, డీఎఫ్ వో లావణ్య, అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్వో  రమాదేవి, డీఎఫ్ వో బాజీరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, జడ్పీటీసీ సకినాల భవాని తదితరులున్నారు.

పలు భవనాలను ప్రారంభించిన మంత్రి..

ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్... జిల్లాకేంద్రంలోని గాంధీ పార్కును ప్రారంభించారు. ములుగు మండలం బండారుపల్లి రోడ్డులో కొత్తగా రూ.70లక్షలతో నిర్మించిన డీసీవో ఆఫీసును ఓపెనింగ్ చేశారు. అదే విధంగా డీఎంహెచ్ వో ఆఫీసులో కుటుంబ నియంత్రణ శాశ్వత పద్ధతులకు సంబంధించిన వాల్ పోస్టర్ లను ఆవిష్కరించారు. అనంతరం రూ.20లక్షలతో నిర్మించిన ఏరియా ఆస్పత్రి ఔషధ గిడ్డంగి గోదాంను, మినీ స్టేడియం వెళ్లే దారిలో  సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు.

‘గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్’

తొర్రూరు, వెలుగు: సీఎం కేసీఆర్ గిరిజనుల ఆరాధ్య దైవమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. మంగళవారం తొర్రూరు మండల గిరిజన నాయకులు హైదరాబాబద్ లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు, బంజారా భవన్ కట్టించిన నాయకుడు దేశంలోనే ఎక్కడా లేడన్నారు. టీఆర్ఎస్ పార్టీకి గిరిజనులంతా అండగా నిలవాలన్నారు.