బతుకమ్మ సంబురాలకు ఓరుగల్లు ముస్తాబు

బతుకమ్మ సంబురాలకు ఓరుగల్లు ముస్తాబు
  • రేపటి నుంచే తెలంగాణ పండుగ షురూ
  • రాష్ట్రస్థాయి ఉత్సవాలు వేయి స్తంభాల గుడిలో ప్రారంభం
  • తరలిరానున్న మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర నేతలు
  • ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిన జిల్లా ఆఫీసర్లు

హనుమకొండ, వెలుగు: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగకు వేళైంది. ఈ నెల 21న భాద్రపద మాసం అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు బతుకమ్మ సంబురాలు జరుగనుండగా, ఈసారి ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ఆదివారం హనుమకొండలోని వేయి స్తంభాల గుడి నుంచే ప్రారంభం కానుండగా, అధికార యంత్రాంగం పనులపై ఫోకస్ పెట్టింది. 

ఓరుగల్లు నుంచి షురూ.. 

బతుకమ్మ పండుగపై వివిధ కథలు ప్రచారంలో ఉండగా, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లిలోనే ఈ పండుగ పుట్టిందనే ప్రాచూర్యంలో ఉంది. దీంతో ఉమ్మడి జిల్లా కేంద్రమైన వరంగల్ నగరంలోని వేయి స్తంభాల గుడి నుంచే ఉత్సవాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేయి స్తంభాల గుడిలో ఆదివారం నిర్వహించే ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్రస్థాయి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మినిస్టర్​ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు.. 

తెలంగాణ పండుగ బతుకమ్మను ఈసారి వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టూరిజం, ఎండోమెంట్ తో పాటు జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో వేయి స్తంభాల గుడిలో లైటింగ్ సిస్టం పెట్టారు. మహిళలు పెద్దసంఖ్యలో తరలిరానుండటంతో ఎక్కువ మంది మహిళా పోలీసులతోనే బందోబస్తు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. 

గుడి ఆవరణలో తాగునీరు, టెంపరరీ టాయిలెట్స్ ఏర్పాటు చేయగా, ఉత్సవాల్లో జోష్ నింపేలా సౌండ్ సిస్టంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణకు మున్సిపల్ సిబ్బందిని నియమించారు. ఆదివారం సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు స్టార్ట్ కానుండగా, ఇప్పటికే టూరిజం, ఎండోమెంట్ ఉన్నతాధికారులను ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నడిరోడ్డుపైనే సద్దుల బతుకమ్మ.!

ఉత్సవాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మను హనుమకొండలోని పద్మాక్షి గుండం వద్ద నిర్వహిస్తుంటారు. కానీ, సద్దుల బతుకమ్మ పండుగకు ఏటికేడు స్థల సమస్య ఏర్పడుతోంది. ఇప్పటికే పద్మాక్షి ఆలయ భూములు చాలావరకు కబ్జాకు గురికాగా, అక్కడున్న కొద్దిపాటి స్థలం బతుకమ్మ ఆటపాటలకు సరిపోని పరిస్థితి నెలకొన్నది. దీంతో స్థలం సరిపోవట్లేదని కొంతమంది మహిళలు బతుకమ్మను ఇక్కడికి తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. అక్కడున్న కొద్దిపాటి స్థలం పక్కనే హనుమకొండ చౌరస్తాలో ఉండే ఐరన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తీసుకొచ్చి పడేశారు. రోడ్డు కన్ స్ట్రక్షన్ వర్క్ లో భాగంగా వేయాల్సిన పైపులను కూడా అక్కడే వదిలేశారు.

 కొంతమంది ప్రైవేటు బస్సుల పార్కింగ్ కోసం ఈ స్థలాన్ని ఉపయోగిస్తున్నారు. పద్మాక్షి కట్టను ఆనుకుని సరిగమప పార్క్ పక్కనున్న ఓపెన్ ప్లేస్ ను కూడా మొత్తం బండరాళ్లతో నింపేశారు. దానిని చదును చేసినా సద్దుల బతుకమ్మ నిర్వహణకు ఉపయోగపడేది. కానీ, అందుబాటులో ఉన్న స్థలాన్ని వినియోగించుకోవడంపై ఆఫీసర్లు దృష్టి పెట్టకపోవడంతో సద్దుల బతుకమ్మ పండుగకు ఏటా పద్మాక్షి నడిరోడ్డే దిక్కవుతోంది. ఇప్పటికైనా సద్దుల బతుకమ్మ పండుగకు ఆటంకాలు ఏర్పడకుండా ఆఫీసర్లు తగిన ఏర్పాట్లపై ఫోకస్ పెట్టాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.