ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,వెలుగు: తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగా ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్, డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్​చెప్పారు. సోమవారం భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు వారు హాజరై మాట్లాడారు. సంస్కృతీ సంప్రదాయాలు నిరంతరం కొనసాగించాలన్నారు. అనంతరం మోహన్​రావు పటేల్, రామారావు పటేల్​ను మిత్ర మండలి సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కిరణ్ ఖారే, సీఐ ప్రవీణ్​కుమార్, నాయకులు సుభాష్, మున్సిపల్​మాజీ చైర్మన్​బాజనోళ్ల గంగాధర్,  కాండ్లి సాయినాథ్, కాశీనాథ్, అల్లకొండ రాజేశ్వర్, పురస్త చిన్నన్న, గజ్జరాం, డాక్టర్ రామకృష్ణగౌడ్, నగేశ్​ తదితరులు పాల్గొన్నారు.

బాలిక మృతిపై డీఎంహెచ్​వో విచారణ
కాగ జ్నగర్,వెలుగు: జ్వరంతో చింతలమానేపల్లి మండలం కొర్శిని గ్రామానికి చెందిన నైతం దీపాలి (9) మృతి చెందిన ఘటనపై సోమవారం డీఎంహెచ్​వో ప్రభాకర్ రెడ్డి విచారణ చేపట్టారు. మండలంలోని బాబాపూర్ ​రెసిడెన్షియల్​ స్కూల్​లో మూడో తరగతి చదువుతున్న దీపాలి గత శుక్రవారం జ్వరం బారినపడింది. కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ట్రీట్మెంట్ చేయించినా జ్వరం తగ్గలేదు. శనివారం కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు అక్కడి నుంచి మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. ఘటనపై కలెక్టర్​రాహుల్​ రాజ్ ​స్పందించి విచారణకు ఆదేశించారు. డీఎంహెచ్​వో ప్రభాకర్ రెడ్డి గ్రామంలో ఎంక్వైరీ చేశారు. జిల్లా ఇమ్యూనైజేషన్​ ఆఫీసర్​ డాక్టర్ కృష్ణ ప్రసాద్ తో కలిసి బాలిక తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. 

మేధావుల సలహాలతోనే మోడీ ముందుకెళ్తున్నారు
నిర్మల్,వెలుగు: మేధావుల సలహాలు, సూచనలతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుకెళ్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిశోర్ రెడ్డి చెప్పారు. సోమవారం స్థానికంగా నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సబ్ కా సాత్, సబ్ కా ప్రయాస్, సబ్ కా వికాస్ అనే నినాదంతో పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలతో అనేక పథకాలు అమలు చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో ఒంటెద్దు పోకడల పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, పెద్దపల్లి ఇన్​చార్జి రావుల రాంనాథ్, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, ప్రధాన కార్యదర్శులు మెడిసిమ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, మేధావుల సదస్సు కన్వీనర్ వినాయక్ రెడ్డి, డాక్టర్ సెల్ కన్వీనర్ మల్లికార్జున్​రెడ్డి, ఒడిసెల శ్రీనివాస్, అలివేలు మంగ, కొరిపెల్లి శ్రావణ్ రెడ్డి, పెండి జడ్పీటీసీ జాను బాయి తదితరులు పాల్గొన్నారు.

కన్నాల భూముల కబ్జాపై కలెక్టర్​ సీరియస్
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీలో ప్రభుత్వ భూముల కబ్జాపై కలెక్టర్​ భారతీ హోళికెరి సీరియస్​అయ్యారు. ‘క్రీడా ప్రాంగణాల భూమి కబ్జా’ శీర్షికన ఈ నెల 23న వెలుగులో ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. ఆక్రమణపై ఆఫీసర్లు, ఇంటలిజెన్స్​ఆఫీసర్లతో ఆరాతీస్తున్నారు. నేషనల్ ​హైవేను ఆనుకొని దాదాపు రూ.5 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జాచేసిన వారిపై క్రిమినల్​ ​కేసులు పెట్టాలని, అవసరమైతే పీడీ యాక్ట్​ నమోదుచేయాలని ఆదేశించినట్లు సమాచారం.

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె
మందమర్రి,వెలుగు: సింగరేణి మైనింగ్ స్టాఫ్  పెండింగ్​ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేయడానికి సిద్ధమని బెల్లంపల్లి రీజియన్ మైనింగ్​ స్టాఫ్​ కన్వీనర్ వంగరి రాజేశ్వర్​రావు తెలిపారు. సోమవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియా మైనింగ్​ స్టాఫ్​ సింగరేణి డైరెక్టర్​(ఆపరేషన్స్, పా) ఎస్.చంద్రశేఖర్​ను కలిసి వినతిపత్రాలు అందించారు. మైనింగ్ స్టాఫ్ అండర్ గ్రౌండ్ లో ఏదైనా కారణాలతో మెడికల్ అన్ ఫిట్ అయితే సర్ఫేస్​లో అదే హోదా కల్పించాలన్నారు. డైరెక్టర్​ను కలిసినవారిలో రీజియన్ కన్వీనర్ వంగరి రాజేశ్వర్ రావు, శ్రీరాంపూర్, మందమర్రి, ఆర్జీ1 ఏరియాల ఇన్​చార్జీలు గోపతి సత్యనారాయణ, మారపెల్లి బాబు, రాజేశ్​యాదవ్, మిట్ట శంకరయ్య తదితరులు ఉన్నారు.

ప్రతిపక్ష లీడర్ల అరెస్టు సరికాదు
భైంసా,వెలుగు: మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీల లీడర్లను ముందస్తు అరెస్టు చేయడం సరికాదని తెలంగాణ జన సమితి ముథోల్ ​నియోజకవర్గ ఇన్​చార్జి సర్దార్ వినోద్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు దేవోజీ భూమేశ్​ ఫైర్​అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి, కేసీఆర్ ​నియంతృత్వ పాలన అంతం కోసం ఎంతటి త్యాగానికి అయినా సిద్ధమన్నారు. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే నిధుల మంజూరుకు కృషిచేయాలన్నారు. లీడర్లను నిర్బంధిస్తే ఉద్యమం ఆగదని పేర్కొన్నారు.

స్టాండింగ్ కమిటీ మీటింగ్​కు సభ్యుల గైర్హాజరు 
మంచిర్యాల, వెలుగు: జడ్పీ ఆఫీసులో సోమవారం నిర్వహించిన స్టాండింగ్​ కమిటీ సమావేశాలకు మెజారిటీ సభ్యులు గైర్హాజరయ్యారు. జడ్పీ చైర్​పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, నిర్మాణ పనులు, ప్రణాళిక, ఆర్థిక కమిటీ సమావేశాలకు గాను వ్యవసాయం, సాంఘిక సంక్షేమం సమావేశాలు మాత్రమే జరిగాయి. మిగతా కమిటీ సభ్యులు గైర్హాజరు కావడంతో సమావేశాలు జరగలేదు. జడ్పీ చైర్​పర్సన్​ టీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​ పార్టీలో చేరడంతో రూలింగ్​ పార్టీ సభ్యులు జడ్పీ సమావేశాలతో పాటు స్టాండింగ్​ కమిటీ మీటింగులకు సైతం డుమ్మా కొడుతున్నారు.  

బీజేపీ కాసిపేట మండల ప్రధాన కార్యదర్శిగా సంపత్
బెల్లంపల్లి రూరల్,వెలుగు: కాసిపేట మండలం చిన్న ధర్మారం గ్రామానికి చెందిన సూరం సంతోష్​కుమార్​ను​ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా నియమించారు.ఈ సందర్భంగా సంపత్ ​మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ రాచర్ల సంతోష్​కుమార్, మండల ఇన్ చార్జి అట్కపురి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

తాళం వేసిన ఇళ్లకు కన్నం
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఎస్పీ సురేశ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం ఆసిఫాబాద్​లో ఎస్పీ సురేశ్​ కుమార్ దొంగల వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి కి చెందిన బండి నీలేశ్​ కొన్ని నెలల క్రితం రెబ్బెనకు వచ్చి బైక్ మెకానిక్ షాప్​ పెట్టుకొని దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దగ్గరి బంధువులు తాండురు మండలం కత్తెర్ల గ్రామానికి చెందిన దూల రాజేశ్, దూల నవీన్​తో కలిసి చోరీల కోసం ప్లాన్​ వేశాడు. తాళం వేసిన ఇండ్లు, బంగారం దుకాణాలు, షాప్ లను టార్గెట్​ చేసేవారు. ఇందుకోసం నీలేశ్ పగటి పూట బుల్లెట్ ​బండి మీద తిరిగి స్కెచ్​వేసేవాడు. రాత్రిపూట, ముఖ్యంగా వర్షం పడ్డ రోజుల్లో దొంగతనాలకు పాల్పడేవారు. కొద్ది రోజుల తర్వాత దొంగలించిన సొమ్ము, నగదు నగదును పంచుకొని జల్సాలు చేసేవారు. సోమవారం వాంకిడి మండలం లంజన్ వీర ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై దీకొండ రమేశ్​ వెహికల్స్​తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్ మీద అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా దొంగతనాల విషయమ బయటపడింది. నిందితులు ముగ్గురిపై మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆరు దొంగతనం కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. వీరి నుంచి 123 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, రూ. 8,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్, ఎస్సై రమేశ్, సిబ్బందిని అభినందించి క్యాష్ రికార్డు అందజేశారు.

79వ సారి అన్నదానం
ఆదిలాబాద్, వెలుగు: సంగెం చారిటేబుల్ ట్రస్ట్ నిర్వహకులు సంగెం సుధీర్ కుమార్ 79వసారి అన్నదానం చేశారు.  ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతీ ఆదివారం అన్నదానం చేస్తున్నారు. ఈ ఆదివారం బస్టాండ్ ఎదుట నిరుపేదల కడుపునింపారు. కార్యక్రమంలో నిర్వాహకులు సుధీర్ కుమార్, మహేందర్ రెడ్డి, సలీం, సుభాష్, పవన్, లకన్ తదితరులు పాల్గొన్నారు. 

జోరుగా సాగుతున్న జోనల్ గేమ్స్  
దండేపల్లి, వెలుగు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కాళేశ్వరం జోనల్​ స్థాయి గేమ్స్​ రెండో రోజు సోమవారం లక్సెట్టిపేటలో జోరుగా సాగాయి. అండర్14, 17, 19 విభాగాల్లో రన్నింగ్​, షార్ట్​ఫుట్​, టెన్నికాయిట్​, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్​తో పాటు 11 ఈవెంట్స్​ జరిగాయి. రీజినల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ మల్లిక, ఆర్సీవో సువర్ణలత, ఏఆర్సీవో కోటిచింతల మహేశ్వరరావు, బెల్లంపల్లి సీవోఈ ప్రిన్సిపాల్​ ఐనాల సైదులు 
తదితరులు పాల్గొన్నారు.  

కేంద్ర పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్​టౌన్,వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ మాజీ చైర్​పర్సన్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి కోరారు. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా వందశాతం రాయితీతో ఖాదీ బోర్డ్ చైర్మన్ పేరాల శేఖర్ రావు ఆధ్వర్యంలో భాగ్యనగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన పేపర్ ప్లేట్స్ యూనిట్ ను సోమవారం ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో లీడర్లు తార, అక్షయ్ రెడ్డి, రేణుక, లక్ష్మి, సువర్ణ, సంధ్యారాణి 
తదితరులు పాల్గొన్నారు.